YCP: కడప( Kadapa) మేయర్ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. మేయర్ గా ఉన్న సురేష్ వేటు పడింది. ఆయనపై అక్రమ ఆరోపణలు రుజువు కావడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అయితే ఐదు నెలల గడువు ఉండడంతో పాలనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఎన్నికలకు సిద్ధపడింది ఎలక్షన్ కమిషన్. రేపు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి స్పష్టమైన బలం ఉంది ఇక్కడ. ఆపై తెలుగుదేశం పార్టీ ఆకర్ష్ ప్రయోగం అంటూ చేయడం లేదు. అటువంటి ప్రయత్నాలు లేవు అక్కడ. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో భయపడుతోంది. మేయర్ గా వేటుపడిన సురేష్ బాబు ఎన్నిక నిర్వహణపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. ఇదివరకే ఆయన కోర్టుకు వెళ్లి రక్షణ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆశ్రయించారు.
* ఈరోజు విచారణ..
కడప కార్పొరేషన్ లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి స్పష్టమైన బలం ఉంది. అదే పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ఉన్నారు. వైసిపి కార్పొరేటర్లు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఎందుకో ఆ పార్టీ భయపడుతోంది. సురేష్ బాబు ద్వారా కోర్టులో పిటీషన్లు వేయించింది. ఈరోజు దానిపై విచారణ జరపనుంది హైకోర్టు. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నిక నిర్వహిస్తారా? లేదా? అనేది తేలుతుంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు. సురేష్ బాబును తప్పించి మరో వైసీపీ కార్పొరేటర్ మేయర్ గా ఎన్నిక కావచ్చు కదా? ఏదో తెలియని ఆందోళనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
* ఫలితం మారితే!
కడప అంటేనే వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy ) కుటుంబానికి పెట్టని కోట. ఇప్పటికే పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. కనీసం డిపాజిట్లు రాలేదు అక్కడ. అయితే అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించింది వైసిపి. అయితే ఇక్కడ ఏమాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు టిడిపి వైపు వెళ్ళిపోతే కడప లో సైతం ఆ పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదు. ఆ పార్టీ ఆందోళన కూడా. పులివెందులలో అలా జరిగి.. ఇప్పుడు కడపలో ఇలా జరిగితే పార్టీకి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. అందుకే సురేష్ బాబు ద్వారా కోర్టులో పిటీషన్లు వేసి ఎన్నికలు లేకుండా చేయాలని చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కోర్టు స్టే ఇవ్వకుంటే మాత్రం ఎన్నికలు యధావిదంగా జరుగుతాయి. ఆ సమయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎంతమంది చేజారిపోయిన అది ఆ పార్టీకే నష్టం. ఎందుకంటే ఎక్స్ ఆఫీషియో సభ్యుల రూపంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు. వారి సహకారానికి వైసీపీ సభ్యులు తోడైతే కడపలో మేయర్ ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఆ భయంతోనే బహుశా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించి ఉంటుంది.