Indigo Crisis Ram Mohan Naidu: ఏదైనా సంక్షోభం వస్తే కానీ నాయకత్వం సమర్థత తెలియదు. సంక్షోభాలతో పాటు విపత్తుల సమయంలోనే పాలకుల పనితీరు బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా భారతదేశాన్ని ఇండిగో విమాన సంక్షోభం వెంటాడుతోంది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ఈ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును( Ram Mohan Naidu) బాధ్యుడిని చేస్తూ విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అయితే చేయని తప్పునకు ఆయనపై విమర్శలు చేస్తుండడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. అయితే పార్లమెంటు సాక్షిగా రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం మాత్రం ప్రత్యర్థులను సైతం ఆలోచింపజేసింది. ఆయన నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసింది. ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియంది కాదు కానీ.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినందించేదాకా పరిస్థితి వచ్చింది.
* ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ..
భారతీయ విమానయానంలో ఇండిగో సంస్థకు( Indigo company) 60% ఆక్యుఫెన్సీ ఉంది. కానీ ఏ ఎయిర్లైన్స్ కు రాని సమస్య ఇండిగో కు ఎందుకు వచ్చింది అన్నది ప్రశ్న. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ పైలట్లకు వీలైనంత ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలన్నది పౌర విమానయాన శాఖ ఆలోచన. ఇదే నిబంధనను అన్ని ఎయిర్ లైన్స్ కు ఆదేశించింది కేంద్రం. కానీ తమ సంస్థలో సంక్షోభాన్ని దాచింది ఇండిగో సంస్థ. చివరిదాకా గోప్యంగా ఉంచింది. అయితే ఓ ప్రైవేట్ సంస్థ వ్యవహారాలను కేంద్ర పౌర విమానయాన శాఖకు ముడిపెట్టి విమర్శలు చేస్తోంది విపక్షం. కేవలం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్య వైఖరి తోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ఇప్పుడు దుమారం రేపుతోంది.
* సంక్షోభం అలా చక్కదిద్ది..
ఏదైనా సంక్షోభం వస్తే దానికి పరిష్కార మార్గం చూపాలి. వెంటనే ఇండిగో సంస్థ పై చర్యలకు దిగితే ఆ సంక్షోభం మరింత పెద్దది అవుతుంది. ఎన్నెన్నో ఇబ్బందులకు దారితీస్తుంది. కానీ పిన్నవయస్కుడైన రామ్మోహన్ నాయుడు ఆ పని చేయదలుచుకోలేదు. ప్రత్యేక వార్ రూమ్( war room ) ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలను అన్వేషించారు. అదనపు విమాన సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా పైలట్లను అందుబాటులోకి తెచ్చారు. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి టికెట్ నగదును రిఫండ్ చేశారు. అయితే ఇన్ని చేస్తే అదే రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని.. ఆయనకు రెండు నెలల ముందు నుంచే తెలుసు అని చెబుతున్నారు. పైలెట్ల విశ్రాంతిని పెంచితే విమాన ప్రయాణం భద్రతగా ఉంటుందన్న ఆలోచనతో అన్ని ప్రైవేటు కంపెనీల ఎయిర్ లైన్స్ కు ఇదే చెప్పారు. కానీ దేశంలో సింహభాగం ఉన్న ఇండిగో సంస్థకు మాత్రం ఇది రుచించలేదని తెలిసింది. ఆ విషయాన్ని ఆ సంస్థ గోప్యంగా ఉంచింది. ఏదైనా ప్రైవేట్ సంస్థకు గుత్తాధిపత్యం పెరిగితే ఎలా ఉంటుందో.. అలానే చేసి చూపించింది ఇండిగో సంస్థ. అంతకుమించి ఇందులో ఏమీ కనబడలేదు.
* చివరి వరకు గోప్యం..
ఇండిగో ఎయిర్ లైన్స్ ఎప్పటినుంచో భారత పౌర విమానయానలో సింహభాగం సర్వీసులను దక్కించుకుంది. అలాగని ఆ సంస్థను తక్కువ చేసి చూడలేం. సేవలతో పాటు సమయ భావం పాటించడంలో ఆ సంస్థ ముందుంటుంది. ఆపై ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఆ సంస్థపై ఆ నమ్మకం కొనసాగుతుండగా పైలెట్ల విషయంలో విధించిన నిబంధనలు.. ఆ సంస్థకు రుచించకపోవడం ఎవరిది తప్పు. పైగా చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచడం.. చివరి నిమిషంలో సర్వీసులను రద్దు చేయడం ఆ సంస్థ తప్పు. దానికి పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత తీసుకోవాలని అనడం మాత్రం నిజంగా రాజకీయ దురుద్దేశం. అందుకే ప్రధాని మోదీ ధైర్యం చెప్పారు. పార్లమెంటులో రామ్మోహన్ నాయుడు సమాధానం పై సంతృప్తి వ్యక్తం చేశారు. గో హెడ్ అంటూ భుజం తట్టారు. మున్ముందు ఇలాంటి సంక్షోభాలు ఎన్నో వస్తాయని.. తట్టుకొని నిలబడాలని ధైర్యం చెప్పారు. ఇండిగో సంక్షోభంతో రాజకీయంగా బలపడాలని ప్రతిపక్షాలు చూసాయి కానీ.. అది అంతిమంగా రామ్మోహన్ నాయుడుని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు.