JanaSena: జనసేనలోకి జానీ మాస్టర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. పార్టీకి ఊపు వచ్చినట్టేనా?

జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సైతం జానీ మాస్టర్ సేవలందిస్తున్నారు. వందలాది పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Written By: Dharma, Updated On : January 25, 2024 11:51 am
Follow us on

JanaSena: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనలో చేరికలు పెరిగాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు జనసేనలో చేరారు. ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం జనసేనలో చేరుతున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ వారికి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పవన్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్టు వారు ప్రకటించారు.

జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సైతం జానీ మాస్టర్ సేవలందిస్తున్నారు. వందలాది పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆయన స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని. కొద్ది రోజుల కిందట నెల్లూరులో అంగన్వాడీల నిరసనకు మద్దతు తెలిపారు. వారికి నగదు సాయం కూడా అందించారు. ఆ మధ్యన రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కు ఆర్జీవి ఎంత అభిమానో.. తాను జగన్ కు కూడా అంతే అభిమానినని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే పవన్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు.

మరోవైపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గత కొద్ది రోజులుగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అటు అధికారంలోకి వచ్చిన తర్వాత పృధ్విరాజ్ ను సీఎం జగన్ గుర్తించారు. టీటీడీ భక్తి ఛానల్ కు సంబంధించి చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ కేటాయించారు. కానీ కొద్ది రోజులకే తన అనుచిత ప్రవర్తనతో పదవికి పృథ్వీరాజ్ దూరమయ్యారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. వైసీపీలో చాలామంది నేతలపై ఆరోపణలు వచ్చాయని.. వారందరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పృథ్వీరాజ్ ప్రశ్నించారు. వైసీపీకి దూరమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ అంటే తనకు అభిమానమని తరచూ చెప్పుకొచ్చేవారు. అటు జనసేనలో చారతానని బాహటంగా ప్రకటించేవారు. నిన్న నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేనలో చేరారు.

ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమపై ఎటువంటి ఒత్తిడి చేయడం లేదు. గత ఎన్నికల్లో కెసిఆర్ సినీ పరిశ్రమపై ఒత్తిడి చేయించి వైసీపీకి అనుకూలంగా మాట్లాడించారని.. ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి ఉండదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చాలామంది సినీ ప్రముఖులు జనసేనకు మద్దతుగా నిలవనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు బుల్లితెర నటులు సైతం జనసేన గూటికి చేరారు. ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి కీలక వ్యక్తులు పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది చేరికలు పెరిగే అవకాశం ఉందని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.