Jogi Ramesh Case Twist : మాజీ మంత్రి జోగి రమేష్ (JOGI RAMESH) చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆయన అరెస్టు తప్పదా? తదుపరి టార్గెట్ ఆయనేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో నోరున్న నేతల్లో జోగి రమేష్ ఒకరు. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం చంద్రబాబు ఇంటిపైనే దండయాత్ర చేశారన్న విమర్శ జోగి రమేష్ పై ఉంది. అటు తరువాతే జోగి రమేష్ కు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడంతో ఈ అనుమానాలకు బలం పెరిగింది.కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందుకే 2024 ఎన్నికల్లో జోగి రమేష్ కు భారీ ఓటమి ఎదురైంది. ఆపై టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జోగి రమేష్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని కుటుంబసభ్యులు అగ్రిగోల్డ్ భూములను అడ్డగోలుగా కొట్టేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో జోగి రమేష్ కుమారుడితో పాటు సమీప బంధువు అరెస్టయ్యారు కూడా.
అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టి..
అగ్రిగోల్డ్ (AGRIGOLD)సంస్థ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. ఆ సొమ్ముతో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాల్లో భారీగా భూములను కొనుగోలు చేయడంతో పాటు భవనాలను సైతం నిర్మించింది. కోట్లాది రూపాయల ఆస్తులను కూడదీసుకున్న తరువాత కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టింది. దీంతో అగ్రిగోల్డ్ యాజమాన్యంపై పోలీస్ కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ ఆధీనంలోకి వచ్చాయి. వీటిలో విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం భూములు కూడా ఉన్నాయి. వాటినే అడ్డగోలుగా కొట్టేసింది జోగి రమేష్ కుటుంబం. దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్న భూములను అక్రమ మార్గంలో.. నిబంధనలకు విరుద్ధంగా సొంతం చేసుకుంది జోగి కుటుంబం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించింది. తాజాగా దర్యాప్తు అధికారులు జోగి కుటుంబం అక్రమ మార్గంలో అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టిందని తేల్చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ తెర వెనుక ఉండి నడిపించారని నివేదికలు ఇచ్చారు. దీంతో జోగి అరెస్టు ఉంటుందని ప్రచారం సాగుతోంది.
Also Read : మనసు మార్చుకున్న ఆ మాజీ మంత్రి.. అదే పార్టీలో కొనసాగింపు!
దూకుడు కలిగిన నేత..
జోగి రమేష్ చాలా దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబు (CM CHANDRABABU), పవన్, లోకేష్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారు. అయితే అప్పటి విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శలు చేశారంటూ జోగి రమేష్ ఊగిపోయారు. పదుల సంఖ్యలో కార్లతో చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో నామమాత్రపు కేసులు నమోదయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో కదలిక వచ్చింది. అటు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కుమారుడితో పాటు సోదరుడు అరెస్టయ్యారు. బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు తెర వెనుక పాత్ర అంతా జోగి రమేష్ ది అని తేలడంతో ఆయన అరెస్టు జరిగే అవకాశం ఉంది.
టీడీపీలో చేరేందుకు యత్నం..
వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత జోగి రమేష్ వైఖరిలో మార్పు వచ్చింది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ తో పాటు చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు సంబంధించిన కేసులు తెరపైకి రావడంతో రమేష్ ఆందోళనకు గురయ్యారు. అందుకే వైసీపీ (YSR CONGRESS PARTY)కార్యకలాపాలకు దూరంగా ఉండిపోయారు. ఒకానొక దశలో టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా గడిపారు. దీనిపై టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో జోగి రమేష్ చేరిక లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందని తేలడంతో తదుపరి అరెస్టు ఆయనదేనని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.