Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్( Jogi Ramesh) తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఆయనకు అంతకంటే ఆప్షన్ లేదు. కూటమి పార్టీల్లో చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. దీంతో మళ్లీ వైసీపీ దిక్కు అన్నట్టు ఆయన పరిస్థితి మారింది. అందుకే రాబోయేది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెబుతున్నారు. మీ లెక్కలు తేల్చుతాం అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక ధీమా కనబరుస్తున్నారు. అయితే ఇన్నాళ్ల సైలెన్స్ తర్వాత జోగి రమేష్ తిరిగి పార్టీలో యాక్టివ్ కావడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతోంది. ఆయన విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. జోగి రమేష్ యాక్టివ్ కావడాన్ని ఆహ్వానిస్తున్న వారు ఉన్నారు. అటువంటి నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదన్న వారు కూడా ఉన్నారు. పార్టీ ఆయనకు ఉపయోగపడిందే తప్ప.. పార్టీకి ఆయన ఉపయోగపడలేదన్నది ఎక్కువమంది వాదన.
Also Read: రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్.. అరెస్టు నుంచి వరుస ట్విస్టులు!
* కేసులతో ఉక్కిరి బిక్కిరి..
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత యాక్టివ్ గా కనిపించారు జోగి రమేష్. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సైతం హాజరయ్యే వారు. అయితే ఎప్పుడైతే ఆయనపై కేసులు ప్రారంభం అయ్యాయో.. అరెస్టు జరుగుతుందని ప్రచారం జరిగిందో.. అప్పటినుంచి జోగి రమేష్ కనిపించకుండా మానేశారు. అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు సైతం గైర్హాజరయ్యారు. చివరకు తన సహచర సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు విజయవాడ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట కొడాలి నానితో పాటు వైసిపి కీలక నేతలంతా ఉన్నారు. కానీ జోగి రమేష్ రాలేదు. దీంతో అందరి దృష్టి ఆయనపై పడింది. దాదాపు ఆయన పార్టీకి దూరమైనట్టేనని ప్రచారం జరిగింది.
* మంచి అవకాశాలు ఇచ్చిన జగన్..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). 2014లో ఛాన్స్ ఇచ్చిన రమేష్ ఓడిపోయారు. 2019లో రెండోసారి అవకాశం ఇచ్చారు. జోగి రమేష్ గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయేసరికి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే జగన్ పై విమర్శలు చేశారని ఏకంగా చంద్రబాబు ఇంటిపై దండయాత్రకు బయలుదేరారు. అప్పట్లో అది పెను సంచలనం అయ్యింది. అక్కడకు కొద్ది రోజులకే జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై దూకుడుగా ఉండేవారు జోగి రమేష్. తీవ్రమైన పదజాలాలతో విమర్శలు చేసేవారు. వ్యక్తిగత కామెంట్స్ కు ఎక్కువగా దిగేవారు.
* గత కొంతకాలంగా పార్టీకి దూరం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ఓటమి ఎదురు కావడంతో అనేక రకాల పాత కేసులు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీలపై విచారణ ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. అప్పటి నుంచి క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగడం ప్రారంభించారు రమేష్. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చేరేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో మంత్రి కొలుసు పార్థసారథితో వేదిక పంచుకున్న జోగి రమేష్ ను చూసి టిడిపి శ్రేణులు కోపంతో రగిలిపోయాయి. దీంతో అప్పటి నుంచి జోగి రమేష్ టిడిపిలో చేరికకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు వరుసగా కూటమి కేసులు పెడుతుండడంతో జోగి రమేష్ తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం ప్రారంభించారు. అందుకే వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి పని చెబుతామని ఆయన హెచ్చరించారు. తద్వారా తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని సంకేతాలు పంపగలిగారు.