AP Job calendar : నిరుద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 18 శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్ణయించింది. నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి 2025 ఏడాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. జనవరి 12న వివేకానంద జయంతి పురస్కరించుకొని కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చారు జగన్. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఒక్క ఏడాదికే పరిమితం అయ్యారు. ఒక్క గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాలు తప్ప.. ఇతర పోస్టులను భర్తీ చేయలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏటా జాబ్ క్యాలెండర్ సైతం ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తొలి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
* 866 పోస్టుల భర్తీకి చర్యలు
ప్రధానంగా ఏపీపీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ ఏడాదిలో మొత్తం 866 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధపడుతోంది. ఒక్క అటవీ శాఖ లోనే 814 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దివ్యాంగ సంక్షేమ శాఖలో వార్డెన్ పోస్టులు.. గనుల శాఖలో రాయల్టీ ఇన్స్పెక్టర్…ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్.. బీసీ సంక్షేమ శాఖలో వెల్ఫేర్ ఆఫీసర్.. జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్.. రవాణా శాఖలో ఎంవీఐ పోస్టులు భర్తీ కానున్నాయి.
* ఆ ఖాళీలన్నీ భర్తీ
పాఠశాల విద్యాశాఖలో డిఇఓ.. పర్యావరణ శాఖలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఎనలిస్ట్ గ్రేడ్ 2.. ఎన్టీఆర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్.. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్.. ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్… గ్రంథాలయ శాఖలో లైబ్రేరియన్స్.. గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్స్.. భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్.. విద్యుత్ శాఖలో పర్యవేక్షకులు.. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధపడుతోంది కూటమి సర్కార్. మొత్తానికి అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటన ద్వారా నిరుద్యోగుల్లో ఆశలు పెంచే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు సర్కార్.