Janasena solo battle: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకటే ఆరాటం. కూటమి పార్టీల మధ్య గొడవలు రావాలి. వారు విడిపోవాలి. అచ్చంగా కుటుంబ బంధాలను విడగొట్టాలనే విలన్ మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు జనసేన తన పార్టీ కార్యవర్గాల ఏర్పాటు పై దృష్టి పెడితే అటువంటి ప్రచారమే చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఒంటరిగా సిద్ధం అవుతుందంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తోంది. అయితే ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఇప్పుడు కూడా విఫల ప్రయత్నంగానే మిగలనుంది. ఎందుకంటే కూటమి మరో 15 ఏళ్ల పాటు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అటువంటి నేత ఒంటరి పోరాటానికి వెళ్తారా? అది నమ్మశక్యం కాని వార్త కూడా.
వైసీపీకి రానివ్వను అంటూ ప్రతిజ్ఞ
పవన్ కళ్యాణ్ ఒక ఆశయంతో పని చేస్తున్నారు. అధికారం కోసం కానే కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనతో ఏపీ 20 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిపోయిందని బలంగా భావిస్తున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. అందుకే పదే పదే పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. తాను రాజకీయ ప్రయోజనాలకు కాదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్న విషయాన్ని పదేపదే గుర్తు చేస్తున్నారు. కచ్చితంగా సర్దుబాటు చేసుకోవాల్సిందేనని సొంత పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. జనసేన సైతం ఈ విషయంలో సెట్ రైట్ అయింది. జనసైనికులు సైతం తమ అధినేత అభిప్రాయాన్ని గుర్తించుకుంటున్నారు.
తేల్చి చెప్పిన చంద్రబాబు..
అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల పార్టీ కార్యవర్గాల ప్రమాణస్వీకారంలో సీనియర్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. కొంతమంది సీనియర్లకు వేరే అభిప్రాయం ఉందని.. కానీ తన అభిప్రాయం జనసేనతో పొత్తు అనేది ఉండాలన్నదే అంటూ తేల్చి చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ సంకేతాలు ఇచ్చారు. పొత్తు కోసం పిఠాపురంలో వర్మ నాయకత్వాన్ని తప్పించారు అంటే.. ఈ స్థాయిలో జనసేన కోసం ఆలోచిస్తున్నారో అర్థం అవుతుంది. ఇటువంటి సమయంలో కూడా జనసేన ఒంటరి పోరాటం, పొత్తు పెటాకులు, కూటమి విచ్ఛిన్నం వంటి మాటలతో వైసిపి చేసేదేమీ లేదు. ఒక్క కంఠ శ్వాస తప్ప..