Pawan Kalyan: ఆ మధ్యన వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అలవోకగా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణ చెబుతారు. మాటల మాంత్రికుడు శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన ఈ మాట నిజజీవితంలో పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉంది. ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారని.. ఇలాంటి విజయం కోసం పవన్ పరితపించారని.. అందుకోసం ఎన్నో మెట్లు దిగారని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. టిడిపి కూటమి కట్టడం, మూడు పార్టీల మధ్య సమన్వయం, ఓట్ల బదలాయింపు వంటి విషయాల్లో పవన్ చూపిన చొరవను గుర్తు చేస్తున్నారు.
పొత్తు కోసం ఎన్నో మెట్లు దిగారు పవన్. ముందుగా సొంత పార్టీ వారిని సముదాయించారు. మన బలం,బలగం తెలుసుకుని సీట్లు అడుగుదామని సర్ది చెప్పారు. కాపుల ఆశాజ్యోతి మీరే, మీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యం, అందుకే ఎక్కువ సీట్లు అడగండి, సింహభాగం ప్రయోజనాలు పొందండి, ఎక్కువ సీట్లు ఇస్తేనే పొత్తుకు ఒప్పుకోండి.. ఇలా చాలా రకాలుగా పవన్ పై ఒత్తిడి ఉండేది. కానీ పవన్ ఒకే ఒక్క కృత నిశ్చయంతో ముందుకు సాగారు. అధికారం నుంచి జగన్ ను దూరం చేయాలని బలమైన లక్ష్యంతో పని చేశారు. ఇందుకుగాను తనను తాను తగ్గించుకున్నారు. జనసేన బలానికి తగ్గట్టు నడుచుకున్నారు. అందుకు ముందుగా పార్టీ శ్రేణులను మలుచుకున్నారు. సొంత సామాజిక వర్గాన్ని ఒప్పించారు. రాష్ట్ర ప్రజలకు నిజాన్ని చెప్పారు. వారి మద్దతు కోరారు. సంపూర్ణ విజయం దిశగా పార్టీని నిలబెట్టారు.
పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసింది 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. రెండు పార్లమెంట్ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. అన్నింటా విజయం సాధించింది. ఏపీలో సంపూర్ణ విజయం సాధించింది ఆ పార్టీయే. అయితే ఇదంతా పవన్ ఆలోచనతోనే ముందుకు సాగింది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరకూడదని అధికార పార్టీ భావించింది. ఇందుకుగాను ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో.. అంతలా చేసింది. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని సవాల్ చేసింది. టిడిపి తో పొత్తు పెట్టుకోవద్దని అస్మదీయులతో పవన్ పై ఒత్తిడి పెంచింది. బిజెపి కలిసి రాకుండా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ వీటన్నింటికీ చెక్ చెప్పారు పవన్. టిడిపి తో పొత్తును ప్రకటించారు. బిజెపిని తీసుకువచ్చారు. సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్నింటిని వదులుకున్నారు. త్యాగాలకు సైతం సిద్ధపడ్డారు. ఓట్ల బదలాయింపునకు కారణమయ్యారు. అవసరమైనప్పుడు తగ్గి.. తరువాత దూకుడు పెంచి అధికార పార్టీ మెడలు వంచారు పవన్. చివరకు తాను అనుకున్నది సాధించారు.