Deputy CM Pavan Kalyan : ఏపీలో వర్ష బీభత్సం నెలకొంది. విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుంది. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడు పడని వర్షం పడింది. 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉంది.భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. విజయవాడలో రైల్వే వంతెనకు తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది.విజయవాడలో దాదాపు సగానికి పైగా ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సు లోనే బస చేశారు.గత రెండు రోజులుగా ఒకవైపు సమీక్షలు నిర్వహిస్తూనే… మరోవైపు బాధిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అర్ధరాత్రి పర్యటనలు చేస్తున్నారు. వేకువ జాము వరకు అక్కడే గడుపుతున్నారు. 7 పదుల వయసును లెక్కచేయకుండా చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అదే సమయంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కానీ ఈ రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. నిన్ననే ఆయన జన్మదినోత్సవం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. కూటమి పార్టీలు సైతం పాలుపంచుకున్నాయి. అయితే ఈ విపత్కర సమయంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ ఎక్కడా కనిపించకపోవడం పై విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పవన్ సింగపూర్ వెళ్లిపోయారని.. అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకున్నారని జోరుగా ప్రచారం సాగింది. మరోవైపు వైసీపీ నేతలు సైతం ఈ ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటమి తరువాత బయటకు రాని మాజీ మంత్రి రోజా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ ప్రజలు కష్టాల్లో ఉంటే వీకెండ్ కోసం మంత్రులు విదేశాలకు వెళ్లిపోయారని.. పవన్ కనిపించకుండా పోయారని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
* వైసిపి విమర్శల నేపథ్యంలో
పవన్ కనిపించకపోవడాన్ని వైసీపీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. ముఖ్యమంత్రి తరువాత ఏకైక డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు పవన్ ఎక్కడ ఉన్నారో ప్రస్తావన లేదు. కనీసం ఆయన ఆచూకీ కూడా లేదు. ఇటువంటి తరుణంలో ముప్పేట ఆయనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తుఫాన్ కంటే పవన్ కనిపించకపోవడం అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.
* జనసేన ఉక్కిరి బిక్కిరి
ఇంతటి వరద పరిస్థితులు నెలకొంటే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జనసేన ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అసలు పవన్ ఎక్కడున్నారన్న విషయం కూడా జనసైనికులకు తెలియదు. ఈ నేపథ్యంలో ఒక రకమైన అనుమానం బయటకు వచ్చింది. పవన్ బయటకు వస్తే అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉందని.. సహాయక చర్యల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని తెలియడంతోనే పవన్ దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే పవన్ పై దాడి, దుష్ప్రచారం నేపథ్యంలో జనసేన స్పందించింది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
* మంగళగిరిలోనే పవన్
మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పవన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో నష్టం పై నివేదికలు పరిశీలిస్తున్నారని చెప్పుకొచ్చింది. తన శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారని పేర్కొంది. ప్రతి ఆరు గంటలకు అన్ని జిల్లాల యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారని ప్రకటించింది. ఈ మేరకు పవన్ చేపట్టిన పనుల వివరాలను ప్రకటించింది.