PAK vs BAN : ఓరి నీ వేషాలో..పాకిస్తాన్ ను చిత్తు చేశాం.. ఇక భారత టార్గెట్.. బంగ్లాదేశ్ కెప్టెన్ ఎకసెక్కాలు…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ జట్టును వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించింది.. తొలిసారి 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్లో తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో పర్యటించేది అనుమానమేనని అప్పట్లో వార్తలు వినిపించాయి. అనేక ఊహగానాల మధ్య బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెళ్ళింది. ఏకంగా ట్రోఫీని సొంతం చేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 3, 2024 8:03 pm

Nazmul Shanto

Follow us on

PAK vs BAN :  పాకిస్తాన్ పర్యటనలో బంగ్లాదేశ్ ఆసాంతం సంచలన ప్రదర్శన చేసింది. క్రికెట్ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆ జట్టు.. రెండవ టెస్టులోనూ అదే జోరు కొనసాగించింది.. తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కంటే తక్కువ పరుగులు చేసినప్పటికీ.. రెండవ ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ ను పేక మేడలా పడగొట్టారు. చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ జట్టు ను వారి సొంత దేశంలో 2-0 తేడాతో ఓడించారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని సన్నాహాలు చేస్తున్న పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ విజయం నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో బృందంపై అభినందనల జల్లు కురుస్తోంది.

రెండో టెస్ట్ 6 వికెట్ల తేడాతో..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 లో భాగంగా పాకిస్తాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నిర్వహించారు. తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా జరిగింది. ఈ టెస్టులో పాకిస్తాన్ జట్టును పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. ఇక మంగళవారం ముగిసిన రెండవ టెస్టులోనూ బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆతిధ్య పాక్ ను మట్టి కరిపించింది.

బంగ్లా కెప్టెన్ ఏమన్నాడంటే..

పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో విలేకరులతో మాట్లాడాడు. ” ఈ విజయం మాకు అత్యంత ముఖ్యమైనది. ఇది కీలకమైనది కూడా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. పాక్ పై ఎలాగైనా గెలవాలని మా ఆటగాళ్లు పట్టుదలతో ఆడారు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్క ఆటగాడు తమ పాత్రను నూటికి నూరుపాళ్ళు పోషించారు.. అందువల్లే మా జట్టు అద్భుతంగా ఆడింది. రెండవ టెస్టులో పాకిస్తాన్ రెండవ ఇన్నింగ్స్ సమయంలో మా జట్టు బౌలర్లు అనితర సాధ్యమైన రీతిలో బౌలింగ్ చేశారు. అందువల్లే మేము ఈ స్థాయిలో నిలిచాం. ఈ సిరీస్ పూర్తయిన నేపథ్యంలో.. మేము తదుపరి టీమిండియాతో తలపడాల్సి ఉంది. ఆ సిరీస్ మాకు అత్యంత ప్రాధాన్యమైనదని” షాంటో వ్యాఖ్యానించాడు. ” పాకిస్తాన్ జట్టుపై సాధించిన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ సానుకూల దృక్పథంతోనే భారత్ లో అడుగుపెడతాం. భారత జట్టుతో జరిగే సిరీస్ లో ముష్ఫికర్ రహీం, షకిబ్ అల్ హసన్ కీలక పాత్ర పోషిస్తారని” షాంటో వ్యాఖ్యానించారు. షాంటో వ్యాఖ్యల నేపథ్యంలో భారత అభిమానులు సోషల్ మీడియా లో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. “ఓరి నీ వేషాలో..పాకిస్తాన్ ను చిత్తు చేశావ్ సరే.. నీ టార్గెట్ అవడానికి భారత్ అంత సులభమైన జట్టు కాదు. ముందు నీ ఎకసెక్కాలు తగ్గించుకో” అంటూ షాంటో ను ఉద్దేశించి హితవు పలుకుతున్నారు. కాగా, బంగ్లా జట్టు సెప్టెంబర్ 19 నుంచి భారత జట్టుతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.