Janasena Survey In AP: ప్రతి రాజకీయ పార్టీ వ్యూహకర్తలను నియమించుకుంటోంది. కానీ జనసేనకు ఇంతవరకు వ్యూహకర్తలు లేరు. అయితే తాజాగా పార్టీ ఆ ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన తరఫున ఓ బృందం ఉత్తరాంధ్రలో సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఈ బృందం పర్యటించి వివరాలు సేకరిస్తోంది. అయితే ఈ సర్వే బృందం ఐపాక్ అని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ సేవలందిస్తోంది. ప్రస్తుతం జనసేన తరుపున సేవలందిస్తున్న వారు పక్క రాష్ట్రాలకు చెందిన వారుగా తెలుస్తోంది. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి? అక్కడ ఏ పార్టీకి బలం ఉంది? జనసేన గ్రాఫ్ పెరిగిందా? అన్న వివరాలను ఆ సర్వే బృందం తెలుసుకుంటున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో జనసేన తరఫున ఈ సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
* గిరిజన ప్రాంతాలపై ఫోకస్..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) రూటు మార్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే మొదట్లో అంతా అంచనా వేయలేకపోయారు కానీ.. పక్కా రాజకీయ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేవారు గిరిజనులు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. అయితే ఆ ఓటు బ్యాంకు తెలుగుదేశం ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాదు. అందుకే ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు కనిపించారు. అందుకే తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. కొండ శిఖర గ్రామాలకు సైతం రహదారులు నిర్మించారు. వారికి ప్రత్యేకంగా సొంత నిధులతో చాలా రకాల వసతులు కూడా సమకూర్చారు. అటు గిరిజనులు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ప్రత్యేక ప్రేమ చూపుతూ వచ్చారు.
* ఈసారి జనసేనకు రిజర్వుడు నియోజకవర్గాలు..
ఏపీలో ఆరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ స్థానం ఎస్టిలకు రిజర్వు అయింది. పునర్విభజనతో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు పెరగనున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా తీసుకోవాలని జనసేన భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలపై పెద్దగా అంచనాలు లేవు. అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తున్నట్లు అర్థమవుతోంది. ఆయన సైతం తన వద్ద ఉన్న అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో గణనీయంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు.. గిరిజనులతో మమేకం అవుతున్నారు. అందుకే అక్కడ జనసేన గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు సర్వే సంస్థలను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే అవసరం అనుకుంటే ఐ ప్యాక్ టీమును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జనసేన భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే గతంలో వైసిపికి పనిచేసిన వారు కాకుండా కొత్తవారిని నియమించుకునే అవకాశం కనిపిస్తోంది.
