CM Jagan On Visakha
CM Jagan On Visakha: విశాఖ నుంచి సీఎం జగన్ పాలన వైసీపీకి నష్టమా? మిగతా ప్రాంతాలను చేజేతులా దూరం చేసుకున్నట్టు అవుతుందా? ఇది భస్మాసుర హస్తమేనా? వైసిపి వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆందోళన ఇది. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించకపోగా.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ ప్రారంభమైంది. ఇక విశాఖ అనే రాజధాని అంటే రాయలసీమ జిల్లాల పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం నష్టదాయకమని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రకటించింది. అయితే దీనిపై ఆసక్తికర చర్చను తెరలేపింది. పాలనా వికేంద్రీకరణ కోసమే ఈ నిర్ణయం అని చెప్పుకొచ్చింది. కానీ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి, అమరావతి రైతులు సైతం ప్రతిఘటించారు. అయినా జగన్ సర్కార్ మొండిగా ముందుకు పోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఇప్పుడే తుది తీర్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేని విధంగా వైసీపీ సర్కార్ తయారు చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో విశాఖలో క్యాంప్ ఆఫీసు ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు విజయదశమిని ముహూర్తం గా పెట్టుకున్నారు.
అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఉత్తరాంధ్ర ప్రజలు సైతం పెద్దగా స్పందించడం లేదు. అలాగని వ్యతిరేకించడం లేదు. విశాఖ నుంచి సీఎం పాలన ప్రారంభిస్తే అక్కడ ప్రత్యేకమైన ప్రయోజనాలు దక్కే అవకాశం ఉందా? అంటే అదీ కనిపించడం లేదు. ఇప్పటికే విశాఖ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే జగన్ విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారో.. అప్పటినుంచి కొన్ని రకాల ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. శాంతి భద్రతల సమస్య తీవ్రమైంది. భూ కబ్జాలు, కిడ్నాప్ లు నిత్య కృత్యమయ్యాయి. సామాన్య ప్రజల సైతం అసౌకర్యానికి గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నగరంలో పెడతారని తెలిసి మరింత భయపడిపోతున్నారు. మున్ముందు ఎటువంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళనతో ఉన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎటువంటి వెనుకబడిన జిల్లాల ప్యాకేజీలు రావడం లేదు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని కేంద్రం నుంచి సాధించడంలో జగన్ సర్కార్ వెనుకబడిపోయింది. అందుకే ఇప్పుడు సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నగరంలో పెడుతున్నా ఉత్తరాంధ్ర ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కృష్ణ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రాజధానిని దూరం చేశారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక రాయలసీమ ప్రజలు కుతకుత ఉడికిపోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. దీనికి మూల్యం తప్పదని భావిస్తున్నాయి.