https://oktelugu.com/

Siddam Sabha: తమిళనాడు రాజకీయాల్లో జగన్ పార్టీ ఎంట్రీ

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆదివారం సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 21, 2024 / 01:58 PM IST
    Follow us on

    Siddam Sabha: అప్పట్లో “ఢిల్లీలో చక్రాలు తిప్పుతా.. దేశం మొత్తం గత్తర లేపుతా.. అవసరమైతే కూటమి ఏర్పాటు చేస్తా” అని కేసీఆర్ అన్నాడు కదా.. 2023 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కూసాలు విరిగిపోయాయి. ఆ దెబ్బకు కెసిఆర్ మాత్రమే కాదు ప్రాంతీయ పార్టీల చెందిన నాయకులు ఎవరూ కనీసం ఢిల్లీ వైపు చూడడం లేదు. ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితమయ్యాడు. పంజాబ్ నుంచి పోటీ చేస్తానంటున్నాడు కానీ అక్కడ అంత సన్నివేశం లేదని అతనికి కూడా తెలుసు. మమతా బెనర్జీ బెంగాల్ దాటి వచ్చే పరిస్థితి లేదు. కెసిఆర్ ఈ పార్లమెంట్ గండం ఎలా గట్టెక్కుతుందని ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు మోడీ కరుణాకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక మిగతా వారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అనూహ్యంగా తమిళనాడు రాజకీయాల్లో జగన్ పేరు వినిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వైసిపి, సాక్షి చేస్తున్న ప్రచారం అలాగే ఉంది.

    ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆదివారం సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. లోకల్ నాయకులకు టార్గెట్లు విధించడంతో కిందా మీదా పడి జనాలను తీసుకొచ్చారు. సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ సభలో ప్రతిపక్షాలను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షి ఎలాగూ సొంత మీడియా కాబట్టి సిద్ధం సభను భారీగా ప్రచారం చేసింది. గతంలో నమస్తే తెలంగాణ కెసిఆర్ ను ఎలాగైతే భుజాన మోసేదో.. అంతకుమించి అన్నట్టుగా సాక్షి జగన్ ను కీర్తిస్తోంది. సరే అది వారి కాంపౌండ్ పత్రిక కాబట్టి.. అది జగన్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తుంది కాబట్టి.మ చేసేదేముండదు. జగన్ ఏపీలో పోటీ చేయబోతున్నాడు కాబట్టి కచ్చితంగా అతడు చేసిన పనుల గురించి ఆ రాష్ట్రంలో చెప్పాల్సిన బాధ్యత సాక్షిపై ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా సాక్షి చెన్నైలో చేస్తున్న ప్రచారమే కాస్త అతిగా అనిపిస్తోంది. కెసిఆర్ గతంలో మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, బీహార్, ఢిల్లీ వంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు నమస్తే తెలంగాణ బట్టలు చింపుకుంది. దేశానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆరే అనే స్థాయిలో ప్రచారం చేసింది. “అతి సర్వత్రా వర్జయేత్” అన్నట్టుగా నమస్తే తెలంగాణకు, కేసీఆర్ కు తత్వం బోధపడింది.

    కెసిఆర్ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న జగన్ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కానీ అతి విషయంలో మాత్రం నమస్తే తెలంగాణను మించిపోతున్నారు. వైసిపి నాయకులు, సాక్షి చేస్తున్న ప్రచారం మరో లెవల్ లో ఉంటోంది. ఇటీవల రాప్తాడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే తమిళనాడు పత్రికలు ఊదరగొట్టాయని సాక్షి రాస్కొచ్చింది. లక్షల మంది తరలివచ్చిన సభను చూసి తమిళ మీడియా నిర్గాంత పోయింది అని లెవల్లో డప్పు కొట్టింది.. ఇక ఆ వైసీపీ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఏపీలోనే కాకుండా తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? అందుకే తమిళ పత్రికలు ఆ స్థాయిలో కవరేజ్ ఇస్తున్నాయా? తమిళ పత్రికలు ఇచ్చిన కవరేజీని చూసి సాక్షి గొప్పగా చూపిస్తోంది అందుకేనా? ఇక్కడే క్షేత్రస్థాయిలో ఇంత విభిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్.. తమిళనాడులో ఏం చేయగలుగుతాడు? ఇదిగో ఇలా సాగుతున్నాయి సోషల్ మీడియాలో చర్చోప చర్చలు. ఏది ఏమైనప్పటికీ.. ఎవరు ఎలా అనుకుంటున్నప్పటికీ.. గతంలో నమస్తే వ్యవహరించిన తీరు.. ఇప్పుడు సాక్షి అనుసరిస్తున్న తీరు సేమ్ టు సేమ్. అంతే అంతకుమించి ఏమీ లేదు.