CM Chandrababu: కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. వచ్చే నెల నుంచి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు జగన్.కూటమికి ఆరు నెలల అవకాశం ఇచ్చామని..ఇకనుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని జగన్ చెప్పుకొచ్చారు.జనవరి మూడో వారంలో ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు.అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడినుంచి ప్రజల్లో ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని చెబుతున్నారు.ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో చేసిన పనులను,అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేయాలని సూచిస్తున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచిన సంగతి తెలిసిందే.బకాయితో కలిసి అందించడమే కాకుండా గత ఆరు నెలలుగా..ప్రతి నెల ఒకటో తేదీన అందించగలుగుతోంది.మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ముందడుగు వేసింది.జగన్ సర్కార్ 6000 పోస్టులను మాత్రమే ప్రకటిస్తే..దానికి పదివేల పోస్టులు జతచేస్తూ..భారీ డీఎస్సీ ప్రకటన చేసిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు చంద్రబాబు. మరోవైపు ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న విషయంపై కూడా ప్రచారం చేయాలన్నారు.దీనిపై ప్రజల్లోకి వెళ్లి వివరిస్తే సానుకూల ఫలితం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
* రహదారులపై ఫోకస్
రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.రహదారుల్లో గోతులు నింపే కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది.సంక్రాంతి నాటికి పూర్తవుతుంది.ఇంకోవైపు పల్లె పండుగ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.దాదాపు 4500 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.ప్రతి గ్రామంలో రహదారులు,కాలువల నిర్మాణం చురుగ్గా సాగుతోంది.ఇంకోవైపు రేషన్ కార్డులు జారీ ప్రక్రియ,అన్నదాత సుఖీభవ,తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఇవన్నీ సంక్రాంతి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.అందుకే ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని చంద్రబాబు సూచిస్తున్నారు.
* చంద్రబాబులో ఆ భయం
సాధారణంగా విపక్ష నేత ప్రజల్లోకి వస్తే దాని మైలేజ్ వేరేలా ఉంటుంది.ప్రభుత్వ వైఫల్యాలు కూడా బయటపడతాయి. ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజల్లోకి బలంగా వచ్చిన తర్వాతనే జగన్ సర్కార్ పై వ్యతిరేకత పెరిగింది.ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబుగుర్తు చేస్తున్నారు.జగన్ కంటే ముందుగా మేల్కొని ప్రజల్లో ప్రచారం చేయాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. మరోవైపు జన్మభూమి 2 కార్యక్రమం జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి అయితే జగన్ రాకమునుపే..కూటమి ఎమ్మెల్యేలను ఎలా చేస్తున్నారు బాబు.మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.