CM Jagan: సీఎం జగన్ భారీ ప్లాన్ తో ఉన్నారు. ఎన్నికల ముంగిట కొన్ని పథకాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో మంచి మార్కులే కొట్టేశారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట రుణమాఫీ వంటి పథకాలకు స్వల్పంగా అమలు చేయాలని చూస్తున్నారు. మరి కొన్నింటికి జీవోలు విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే అందుకు డబ్బు అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అంతంతమాత్రంగా ఉంది.అందుకే కేంద్ర సాయం తీసుకోవాలని చూస్తున్నారు. రుణ పరిమితిని పెంచుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణపరిమితిలో మినహాయింపు పొందాలని భావిస్తున్నారు.
ఇప్పుడు కేంద్రంతో రాజకీయంగా కంటే.. కొన్ని రకాల మినహాయింపులు పొందాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ కూటమిలోకి బిజెపి రానుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం జగన్ ప్రయత్నిస్తుండడం విశేషం. అయితే ఇప్పటికే విపక్షం మేనిఫెస్టో ప్రకటనతో దూకుడుగా ఉంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ స్థాయిలో హామీలు ఇస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అందుకే కొన్ని రకాల పథకాలకు శ్రీకారం చుట్టి.. మరి కొన్నింటికి జీవోలు జారీ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట ప్రజల ఖాతాల్లో నగదు పడితే.. వారికి నమ్మకం కలుగుతుందని.. అప్పుడే ప్రజా మద్దతు పొందగలుగుతామని జగన్ భావిస్తున్నారు.
గత కొంతకాలంగా జగన్ ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేవీ ఫలించలేదు. చంద్రబాబు అమిత్ షాను కలిసిన తర్వాత ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ తో సమావేశం అయ్యారు. అయితే ప్రధాని కోసం గంట పాటు వెయిట్ చేసి.. చివరకు పది నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు నిజంగానే ప్రధానితో భేటీకి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రుణ పరిమితికి సంబంధించి అనుమతి తీసుకునేందుకు జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. రైతు, డ్వాక్రా రుణమాఫీ కి సంబంధించి ప్రకటనతో పాటు జీవో జారీ చేయాలని జగన్ భావిస్తున్నారు. అలా చేస్తేనే ప్రజలు నమ్ముతారని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రధాని ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఈనెల 13 వరకు ఆయనకు బిజీ షెడ్యూల్ ఉంది. అయినా సరే ప్రధాని మోదీ కోసం జగన్ చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తన సిద్ధం సభలతో పాటు ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.