Polavaram Project: పోలవరం పై ఏపీలో మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. గత ఐదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పై వైసీపీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ఇదే ప్రచార అస్త్రంగా మారింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై దృష్టి పెట్టిన నేపథ్యంలో జగన్ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. నవంబర్ 6న విదేశీ బృందం వస్తున్న నేపథ్యంలో జగన్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై అధికారపక్షం మండిపడుతోంది. కౌంటర్లతో పొలిటికల్ వార్ మొదలైంది. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై నాడు చంద్రబాబు సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే నిర్మాణ బాధ్యతలు తామే చూసుకుంటామని చెప్పుకొచ్చారు. తద్వారా వీలైనంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే అప్పట్లో రాజకీయ విభేదాలతో ఎన్డీఏ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారం అందించలేదు. దాని ప్రభావం పనులపై పడింది. గత ఐదేళ్లుగా పనుల్లో ఎడతెగని జాప్యం జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు మరోసారి దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలవరం విషయంలో చంద్రబాబు సర్కార్ పై ప్రజల్లో ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది. అయితే గత ఐదేళ్లలో పోలవరం విషయంలో తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయని జగన్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సైతం అదే ప్రచారాన్ని ఎంచుకున్నారు. అయితే దానికి సహేతుకమైన ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేస్తుండడం విశేషం.
* అభ్యంతరకర కామెంట్స్
తాజాగా జగన్ పోలవరం ఎత్తు విషయంలో అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు ఏటీఎం గా పోలవరం ప్రాజెక్టు మారిందని చెప్పుకొచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని కూడా ఆరోపించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే తాగు, సాగునీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పుకొచ్చారు సాయిరెడ్డి. అయితే ఇదే విషయంపై జగన్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ ప్రజలకు జీవనాడిగా భావించే పోలవరం విషయంలో.. ఒక ప్రతిపక్ష నేతగా ఆధారాలు చూపించాల్సిన అవసరం జగన్ పై ఉంది. కానీ అటువంటి ఆధారాలు చూపకుండా పెట్టిన పోస్ట్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
* కేంద్రం ధ్రువీకరణ ఏది?
చంద్రబాబు గారు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు జగన్. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న మీరు ఎందుకు నోరు మేదపడం లేదు? సవరించిన అంచనాలకు ఆ మేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలను దెబ్బతీస్తున్నారు కదా? ఎందుకలా లాలూచీ పడుతున్నారు? పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే.. 41.15 మీటర్లకు ఎందుకు పరిమితం చేస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇదే తరహా ఆరోపణలు చేశారు. కానీ కేంద్రం ఎత్తును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పై ఎటువంటి ధృవీకరణ చేయలేదు. పోనీ దానికి ఆధారం గా ఏదైనా చూపించి ఉంటే బాగుంటుంది. కానీ అటువంటివి చూపకుండానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు జగన్. కుటుంబ వివాదాల నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని సీఎంచంద్రబాబుపై ఆరోపణలు చేశారు జగన్. కానీ తాజాగా జగన్ వైఖరి చూస్తుంటే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆలోచిస్తున్నట్లు ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
1.@ncbn గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా?…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 30, 2024