Jagan (3)
Jagan: ఇటీవల జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. ఉగాది నుంచి ప్రజల్లోకి బలంగా రావాలని భావిస్తున్నారు. ఒకవైపు పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తూనే.. గట్టిగానే పోస్టుమార్టం చేస్తున్నారు. పార్టీలో సమూల మార్పులు చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్న నేతల స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు. పార్టీని ఒక వైపు గాడిన పెడుతూనే.. ప్రజల్లోకి వెళ్లి కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడ సబ్ జైలుకు వెళ్లి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. నిన్నటికి నిన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఇదే దూకుడుతో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
* ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. అయితే నిబంధనల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెబుతోంది. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి తెగేసి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు జగన్. తరువాత ఆయన ముఖం చాటేసారు.
* ఉగాది నుంచి జిల్లాల పర్యటన
అయితే ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు( districts tour ) సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు అంతకంటే ముందే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. వల్లభనేని అక్రమ అరెస్టుపై గట్టిగానే నిలదీశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇంకోవైపు రైతాంగ సమస్యలపై మాట్లాడుతున్నారు. అటు పార్టీ శ్రేణుల్లో సైతం ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అన్నీ బాగున్నాయి కానీ.. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరై తన గళం విప్పాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం శాసనసభకు వెళ్లి ఆ దూకుడు ప్రదర్శించాలని సూచిస్తున్నాయి.
* కొద్దిమందితో సాధ్యమేనా
అయితే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. కానీ బలమైన ప్రతిపక్షంగా తన ప్రభావాన్ని చాటుకున్నారు. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో బలమైన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, మరో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి వంటి అతి కొద్ది మంది మాత్రమే గెలిచారు. అటు చూస్తే కూటమి బలం ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలు. వారిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లేందుకు మాత్రం సాహసించరని సెటైర్లు పడుతున్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా అలానే ఉంది.