Bhuma Akhila Priya: రాయలసీమలో( Rayalaseema ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నంద్యాలలో పేరు మోసిన కుటుంబాల్లో శిల్ప కుటుంబం ఒకటి. తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. 2017 లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కకపోయేసరికి శిల్పా చక్రపాణి రెడ్డి సైకిల్ దిగేశారు. ఆ వెంటనే వైసీపీ గూటికి చేరారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. 2024 ఎన్నికల్లో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని టిడిపి నేత, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధ్రువీకరిస్తుండడం సంచలనంగా మారింది.
* కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ
కాంగ్రెస్ పార్టీ ( Congress Party)ద్వారా రాజకీయాలు ప్రారంభించారు శిల్పా చక్రపాణిరెడ్డి. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో శిల్పా కుటుంబం తన ఉనికి చాటుకుంటూ వస్తోంది. ప్రధానంగా భూమా కుటుంబంతో దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. ఈ రెండు కుటుంబాలు పరస్పర వ్యతిరేక పార్టీల్లో కొనసాగడం విశేషం. 2004లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు శిల్పా మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే మోహన్ రెడ్డి గెలుపులో సోదరుడు చక్రపాణి రెడ్డి పాత్ర ఉంది. 2011లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రకటించడంతో ఆ పార్టీలో చేరారు. అయితే అనూహ్యంగా 2014 ఎన్నికల కు ముందు టిడిపిలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2017 ఉప ఎన్నికల సమయంలో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు చక్రపాణి రెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
* విషయాన్ని వెల్లడించిన ప్రత్యర్థి
అయితే శిల్పా చక్రపాణి రెడ్డి( Shilpa Chakrapani Reddy ) జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రకటించడం విశేషం. అధికారం చేతిలో లేనిదే శిల్పా కుటుంబం ఉండలేదని.. అధికార దుర్వినియోగం చేయడం వారికి వెన్నతో పెట్టిన విజయాన్ని సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రకాల పనులు చేసుకునేందుకు శిల్పా కుటుంబం జనసేనలో చేరేందుకు సిద్ధపడిందని అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. దీంతో రాజకీయంగా ఇది సంచలన అంశంగా మారింది. ఒకవేళ చక్రపాణి రెడ్డి జనసేనలో మారితే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్లే.
* అప్పుడు ఆ వివాదం
ఎన్నికలకు ముందు జనసేనలో ( janasena)వివాదానికి కారణం శిల్పా కుటుంబం. మెగా, అల్లు కుటుంబాల మధ్య అడ్డగోలు విభజనకు నంద్యాల నియోజకవర్గం కారణం అయింది. ఆ నియోజకవర్గ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ కు స్నేహితుడు. దీంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాల వచ్చారు. మద్దతు ప్రకటించారు. దీనిపై జనసైనికులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా కుటుంబంతో అల్లు కుటుంబం విభేదించిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే అవి సద్దుమణుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ వివాదానికి కారణమైన శిల్పా కుటుంబం జనసేనలోకి వస్తుందన్న వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.