Jagan: ఇంకా గుణపాఠాలు నేర్చుకోని జగన్!

గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేశారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై అదే స్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఎ

Written By: Dharma, Updated On : July 5, 2024 2:51 pm

Jagan

Follow us on

Jagan: జగన్ ఎందుకో గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు దాటుతున్నా వాస్తవాలు గ్రహించడం లేదు. గాడిలో పడుతున్నట్లు కనిపించినా మళ్లీ అదే పాత పాట పాడుతున్నారు. ప్రజా తీర్పునకు వక్ర భాష్యాలు అద్దుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకతతో కాదు.. చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయామంటూ కొత్త పాట పాడుతున్నారు. దాడులు, అక్రమ కేసులను ప్రోత్సహించరాదంటూ నీతులు వల్లె వేస్తున్నారు. ఈవీఎంలను పగులగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచితనానికి జగన్ కితాబు ఇవ్వడం విశేషం. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. జగన్ లో మార్పు కనిపించడం లేదు.. ప్రజా తీర్పును గౌరవించేందుకు ఆయన సిద్ధపడటం లేదు.

గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేశారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై అదే స్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల వల్ల తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు జగన్. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పత్రాలనే వాడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల ఓడిపోయామని కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజల్లో తమపై వ్యతిరేకత ఏర్పడిందన్న విషయాన్ని ఆయన అంగీకరించడం లేదు. అందుకు సిద్ధంగా లేరు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా దాటలేదు. అప్పుడే ప్రభుత్వ పాపాలు పండాయి అంటూ పెద్ద పెద్ద మాటలు అనగలుగుతున్నారు. అధినేత జగన్ నుంచి ఈ తరహా మాటలు రావడానికి సొంత పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి.

మాచర్లలో విధ్వంసం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ వెనుకేసుకు రావడం విశేషం. ఎమ్మెల్యేగా ఉంటూ పోలింగ్ కేంద్రంలో చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంలను పగలగొట్టారు పిన్నెల్లి. ఆ విషయం వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదయింది. పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు. ఒక పార్టీ అధినేతగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించడంలో తప్పులేదు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఈవీఎంలను పగలగొట్టడం గొప్ప పని అన్నట్టు వ్యాఖ్యానించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పిన్నెల్లి మంచోడు కాబట్టే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటూ జగన్ సర్టిఫై చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు సర్కార్ కు హెచ్చరికలు జారీ చేశారు. కక్షపూరిత వ్యవహారాలు మానకుంటే ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించారు. ఇది రిక్వెస్ట్ కాదని..హెచ్చరిక అని చంద్రబాబు సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన రెచ్చగొట్టే మాటలకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కేసులతో పాటు దాడులతో వైసిపి శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో అధికార పక్షానికి గెలికితే పరిస్థితులు ఎలా ఉంటాయో వైసీపీ శ్రేణులకు తెలియనివి కావు. అందుకే అధినేత జగన్ తీరుపై వారు మండిపడుతున్నారు.