Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party : అజ్ఞాతంలోకి నేతలు.. పక్క రాష్ట్రానికి అధినేత.. వైసీపీలో నిస్తేజం!

YSR Congress Party : అజ్ఞాతంలోకి నేతలు.. పక్క రాష్ట్రానికి అధినేత.. వైసీపీలో నిస్తేజం!

YSR Congress Party  : అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? సీనియర్ నేతలు ఎందుకు స్పందించడం లేదు? వారు రాష్ట్రంలోనే ఉన్నారా? రాష్ట్రం దాటి వెళ్లిపోయారా? లేకుంటే కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రజా దర్బార్ ప్రారంభిస్తానన్న జగన్ అకస్మాత్తుగా బెంగళూరు వెళ్ళిపోయారు. సరిగ్గా రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు వేళ జగన్ రాష్ట్రం దాటి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేసుల భయంతో కొందరు, చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో వైసీపీ నేతల తీరు చర్చకు దారితీస్తోంది.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. ఒక్కరంటే ఒక్క సీనియర్ కూడా మాట్లాడడం లేదు. కనీసం టిడిపి కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం లేదు. ఇటీవల చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. వైసీపీ హయాంలో అడ్డగోలుగా జరిగిన అవినీతి బాగోతాన్ని బయటపెడుతున్నారు. సంచలన విషయాలను ప్రకటిస్తున్నారు. ఇవన్నీ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ ఆరోపణలను ఖండించడానికి పేర్ని నాని, మెరుగు నాగార్జున వంటి నేతలు ముందుకు వస్తున్నారు. సజ్జల కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతున్నారు. అంతకుమించి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం గమనార్హం.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ అంతా తనదే హవా అన్నట్టు వ్యవహరించేవారు. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలపై ఆయనే ఎక్కువగా మాట్లాడే వారు. ఆ ఉత్సాహంతోనే తన భార్యను విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దింపి పరాభవానికి గురయ్యారు. జగన్ హయాంలో జరిగిన ప్రతి అవినీతి వెనుక బొత్స పేరు వినిపిస్తోంది. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి అబాసు పాలవుతున్నారు. ధర్మాన ప్రసాదరావు అయితే నోరు మెదపడం లేదు. అసలు బయటకు కనిపించడం లేదు. పెద్దిరెడ్డి అయితే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే వైసీపీ సీనియర్లు ఎవరు పార్టీలో పనిచేసే ఉద్దేశంతో లేరు.

అధికారంలో ఉన్నామని అహంకారంతో చాలామంది నేతలు వ్యవహరించారు. చేతిలో అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా మార్చుకున్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో.. తమను ఇబ్బంది పెట్టినవారు ఊరుకోరని.. అందుకే వీలైనంత కాలం ఎవరికీ కనిపించకుండా పోతే మంచిదని భావిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ, జోగి రమేష్ లాంటి నేతలు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరు ఈ రాష్ట్రంలో లేరు. ఇప్పుడిప్పుడే మళ్ళీ రావాలని అనుకోవడం లేదు.

అసలు పార్టీ అధ్యక్షుడు జగన్ జాడలేదు. ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పులివెందుల వెళ్లారు. అక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోయారు. అక్కడే వారం రోజులు పాటు ఉండిపోయారు. మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే మరోసారి బెంగళూరు ప్రయాణమయ్యారు. ప్రజా దర్బార్ ప్రారంభిస్తామని చెప్పిన రోజే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోవడం వెనుక రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ఉందని తెలుస్తోంది. గతంలో తనను సిఐడి కస్టడీకి తీసుకున్న సమయంలో.. తనపై దాడి జరిగిందని.. అందుకు నాటి సిఐడి చీఫ్ సంజయ్ కుమార్ తో పాటు సీఎం జగన్ తదితరులు కారణమని ఇటీవల రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టులు సైతం ప్రారంభమవుతాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ప్రయాణం కావడం హాట్ టాపిక్ గా మారింది. అధినేత తీరు ఇలా ఉంటే.. నేతల తీరు మరోలా ఉంది. దీంతో వైసిపి నిస్తేజంలా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version