Jagan: అధికారంలో ఉంటే కొన్ని రకాల తప్పులు, తప్పిదాలు చెల్లుబాటు అవుతాయి.కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వీలైనంతవరకు తెలియని విషయాల జోలికి పోకూడదు.ఒకవేళ తెలియకపోతే మౌనంగా ఉండాలి.కానీ ఈ విషయంలో జగన్ వైఖరి అందుకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఆయన హావభావాలు,వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతకంటే మించి సోషల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. వీలైనంతవరకు ఆయనను మౌనంగా ఉంచి మిగతా నేతలు రాజకీయం చేస్తే బాగుంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతులతో పాటు బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. అయితే అక్కడ ఆయన వ్యవహార శైలి, హావభావాలు, విచిత్రమైన ప్రకటనలు చూసి వైసిపి నేతల సైతం తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన నవ్వు చర్చకు దారితీస్తోంది. ప్రత్యర్థి సోషల్ మీడియాకు టార్గెట్ అవుతోంది. మృతుల కుటుంబ సభ్యులు, బాధితులను పరామర్శించినప్పుడు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. అటువంటి చోట నవ్వితే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. చిరునవ్వు మంచిదే కానీ.. గంభీర్యం ప్రదర్శించాల్సిన చోట నవ్వితే ఎదుట వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ జగన్ అదే పనిగా నవ్వుతూ కనిపించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* ఆ అలవాటు పోలే
బుగ్గలను నిమిరి, తలపై చేయి వేసి పలకరించే గుణాన్ని జగన్ ఇంకా విడిచిపెట్టలేదు. విపక్ష నేతగా ఉండేటప్పుడు పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అయితే ఏకంగా ముద్దులే పెట్టారు. తలపై చేయి వేసి నాది భరోసా అంటూ అందరికీ హామీలు ఇచ్చారు. పాదయాత్ర చేసిన దారి పొడవునా ఇదే పరిస్థితి. అప్పట్లో విపక్ష నేత, ఆపై వన్ చాన్స్ అంటూ వీడ్కోలు, విపరీతమైన క్రేజ్ ఉన్న సమయంలో ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఇప్పుడు జరిగింది ప్రమాదం. 18 మంది చనిపోయారు. 60 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అటువంటి చోటకు వస్తే విషాదాన్ని ప్రదర్శించాలి. వెకిలి నవ్వుతో జగన్ కనిపించేసరికి సొంత పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
* పరిహారం ప్రకటనలోనూ అంతే
మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం విషయంలో జగన్ ప్రకటన మరి అభ్యంతరకరంగా ఉంది. ఆయన కంటే ముందుగానే చంద్రబాబు బాధితులను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు సైతం పరిహారం వెల్లడించారు. కానీ జగన్ అదే డిమాండ్ ను వ్యక్తం చేయడం విశేషం.ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారన్న విషయం తెలియలేదో.. పార్టీ శ్రేణులు చెప్పలేదో తెలియదు కానీ.. విలేకరుల ఎదుట నష్టపరిహారాన్ని డిమాండ్ చేసి అడ్డంగా బుక్ అయ్యారు జగన్.
* మొన్నటి వరకు అధికారంలో ఉన్నది ఆయనే
బాధితులను పరామర్శించే క్రమంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ బాధితులపై ప్రేమ కంటే.. తనకు అధికారం అత్యవసరం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు జగన్. ఈ ప్రభుత్వం పరిహారం అందించకుంటే.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఇదివరకే సీఎం అన్న సంగతిని మరిచిపోయారు. జగన్ సీఎం గా ఒక్కసారిగా బాధ్యతలు చేపట్టక ముందు ఇలాంటివి చెబితే జనం నమ్మేవారు. కానీ ఐదేళ్లపాటు ఆయన ఈ రాష్ట్రాన్ని పాలించారు. ప్రజలకు ఆయన గురించి తెలుసు. ఎవరి వైఫల్యం.. ఎందుకు ఈ ఘటనలు జరుగుతున్నాయి.. అన్న విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలుసు. జగన్ నోటి నుంచి ఆ మాటలు వస్తుండడంతో ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.