New Industrial Polacy: ఏపీ అభివృద్ధి విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది. పరిశ్రమలను నెలకొల్పి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు మెరుగుపరచాలని భావిస్తోంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉన్న పరిశ్రమల విస్తరణకు ఉన్న సాధ్యసాధ్యాలను పరిశీలిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు అవుతోంది. ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 2014 నుంచి 2019 మధ్య పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అప్పట్లో చాలా పరిశ్రమలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో అలా వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు దీరడంతో ఆ పాత కంపెనీలన్నీ ఏపీ వైపు చూడడం ప్రారంభించాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు సర్కార్ నూతన పారిశ్రామిక విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం పై భారం పడకుండా.. పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని.. అందుకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక పాలసీని ప్రకటించాలని భావిస్తోంది.
* కొత్త పరిశ్రమల ఊసు లేదు
గత ఐదేళ్లుగా కొత్తగా పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు సైతం రకరకాల కారణాలతో వెళ్లిపోయాయి. అందుకే ఏపీ ఇమేజ్ పై ఆ ప్రభావం పడింది. పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణం గత ఐదేళ్లుగా కనిపించలేదు. దానిని అధిగమించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి కొత్త ఇమేజ్ తెచ్చే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో విరివిగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
* రాయితీలు అందిస్తేనే
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీకి పరిశ్రమలు రావాలంటే చాలా రకాల రాయితీలు అందించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం వద్ద తగినన్ని వనరులు లేవు. ఈ క్రమంలో మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వపరంగా, రాజకీయపరంగా పరిశ్రమలపై ఎటువంటి ప్రభావం చూపకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. గత ఐదేళ్ల కాలంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి స్థానిక వైసిపి ప్రజాప్రతినిధులు కమీషన్లు ఆశించారని ప్రచారం జరుగుతోంది. అటువంటివి ఇప్పుడు జరగకుండా చూడాలని చంద్రబాబు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు.
* ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
పారిశ్రామికవేత్తలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునే పటిష్ట యంత్రాంగాన్ని కూడా రెడీ చేస్తున్నారు. కొత్త పాలసీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రంగాలకు భారీ రాయితీలు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఏపీకి ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. పరిశ్రమలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఏకకాలంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పెట్టుబడులు పెరిగితే స్వల్ప కాలంలో ఏపీ జాతీయస్థాయిలో అభివృద్ధి చెందిన రాష్ట్రం గా గుర్తింపు సాధిస్తుంది.