Jagan: ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు పార్టీ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు చుట్టుముట్టాయి. పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు గుడ్ బై చెబుతున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అయినా సరే జగన్ ధైర్యంతో ముందుకు సాగారు. ఉన్నవారితోనే పార్టీని నడపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళనకు దిగారు. కీలక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చారు. బయటకు వెళ్లిపోయిన నేతల స్థానంలో నూతన నియామకాలు చేపట్టారు. మరోవైపు ఆరు ప్రాంతాలుగా విభజించి రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. గతంలో ఈ విధానం ఉన్నప్పటికీ.. నేతలను అటు ఇటుగా చేశారు. మరోవైపు జనవరి నుంచి ప్రజల్లోకి రావాలని జగన్ భావిస్తున్నారు. అందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు.సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా రానున్నారు.
* జమిలి నేపథ్యంలో
దేశంలో జమిలి ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. 2027 ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు జగన్. అందులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ విస్తృత సమావేశానికి హాజరు కానున్నారు.
* గ్రామస్థాయి నుంచి
గ్రామస్థాయి నుండి పార్టీ ప్రక్షాళనకు దిగారు జగన్. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. బూత్ స్థాయి కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారికి ఆ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చని దిశా నిర్దేశం చేయనున్నారు జగన్. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నారు. విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం సేకరణలో విఫలం వంటి అంశాలపై పోరాటానికి జగన్ పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది.