YS Sharmila padayatra: రాజకీయాల్లో పాదయాత్రలు కొత్త కాదు. కానీ పాదయాత్ర మొదలు పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి. వరుసగా రెండుసార్లు ఓటమితో ఏపీలో పూర్తి నిర్వేదంతో ఉండేది కాంగ్రెస్ పార్టీ. దేశంలో అయితే దాదాపు పది సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉండేది. అటువంటి సమయంలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే ఆయన తరువాత ఎంతోమంది పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుతో పాటు జగన్ మోహన్ రెడ్డి ఈకోవలోకి చేరుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పాదయాత్ర అనేది అధికారం తెచ్చిపెట్టి ఒక జడ పదార్థంగా మారింది. అందుకే ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మరోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు తన సోదరి షర్మిల నుంచి పిడుగు లాంటి వార్త వచ్చింది.
జగన్ పాదయాత్ర కొనసాగింపు..
గతంలో షర్మిల పాదయాత్ర చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లిపోయారు. అయితే కొంతవరకు పాదయాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అటు తరువాత షర్మిల ఆ పాదయాత్ర బాధ్యతలు తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి లేని లోటును తీర్చారు. ఒక విధంగా 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 సీట్లు తెచ్చుకోవడానికి షర్మిల పాదయాత్ర కూడా ఒక కారణం. అయితే షర్మిల పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత షర్మిలను పట్టించుకోవడం మానేశారు. దీంతో షర్మిల జగన్మోహన్ రెడ్డిని కేవలం కుటుంబ పరంగా కాదు రాజకీయంగాను విభేదిస్తూ వచ్చారు. ఇప్పటికీ విభేదిస్తూ వస్తున్నారు.
సరిగ్గా ఆ సమయంలోనే..
వచ్చే ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ అధికారంలోకి రావాలి. రాకపోతే చాలా ఇబ్బంది కరం కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం పాదయాత్రకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది వైయస్సార్ జయంతి రోజున పాదయాత్రను ప్రారంభించి 2029 ఎన్నికల ముంగిట ముగించాలని ప్రణాళిక వేశారు. కానీ ఇప్పుడు షర్మిల సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయానికి తాను మొదలు పెట్టాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంతలా పొలిటికల్ డ్యామేజ్ జరిగిందో తెలియంది కాదు. అందుకే షర్మిల పాదయాత్ర అంటేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారు. అయితే త్వరలో షర్మిల తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి కష్టమని వైసిపి శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.