Jagan Sharmila: గత కొద్ది రోజులుగా జగన్, షర్మిల మధ్య గొడవలు ముదిరి పాకానపడినట్లుగా తెలుస్తున్నాయి. జగన్ సీఎం అయినప్పటి నుంచే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అది రాను రాను మరింత పెరిగిపోయిందనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య వీరి మధ్య ఆస్తుల గొడవ మరింత రచ్చ అయింది. చివరకు తల్లి విజయమ్మ సైతం బహిరంగ లేఖ రాసే పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలపై చెప్పిన విషయాలను విజయమ్మ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. అప్పుడు వైఎస్ ఏ ఆస్తులు ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో పూసగుచ్చినట్లుగా విజయమ్మ తన లేఖ ద్వారా వెల్లడించారు. ఇద్దరి పిల్లలకు సమాన వాటాలు ఇవ్వాలని వైఎస్సార్ అనుకున్నట్లుగానూ తెలిపారు.
ఇక.. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టాలీవుడ్ హీరోతో తనకు సంబంధం ఉందని బాలకృష్ణ ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించినట్లు జగన్ తెలిపారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సైతం జగన్ ప్రదర్శించారు. అయితే.. తాజాగా షర్మిల ఆ వ్యాఖ్యలపై స్పందించారు. అసలు ఆ పనిచేయించింది జగన్ రెడ్డేనని సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సైతాన్ సైన్యంతోనే తనకు ఓ హీరోతో సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. తనకు ఎవరితో ఎలాంటి రిలేషన్ లేదని అప్పుడు తన పిల్లలపై ఒట్టు కూడా వేశానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు కూడా ఒట్టు వేస్తున్నానని ఆవేదన చెందారు.
2019 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసుల సాయంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేయడానికి వైసీపీ కార్యకర్తలే ఫేక్ అకౌంట్లతో ఓ హీరోతో షర్మిలకు రిలేషన్ అంటగట్టారు. దానిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. దాంతో అప్పటి నుంచే షర్మిల ఈ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు వాటిని ఇష్టారీతిన షేర్ చేశారు. కామెంట్లు కూడా చేశారు. దాంతో షర్మిల హైదరాబాద్‌లో ఫిర్యాదులు ఇప్పించారు. పోలీసులు స్పందించి చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. ఎన్‌బీకే బిల్డింగ్ నుంచే పోలీసులు పెట్టినట్లు ఆరోపించారు.
అయితే.. ఇప్పుడు అదే క్లిప్పింగును తీసుకొచ్చి జగన్ రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ.. తాజాగా షర్మిల వాటిని తిప్పికొట్టారు. దీంతో అప్పుడు ఇప్పుడు తన సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసినట్లుగా ఆరోపించడం సంచలనమైంది. మరోవైపు.. అదానీ లంచాల వ్యవహారంపైనా షర్మిల స్పందించారు. జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని, లంచాలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారా అని నిలదీశారు. జగన్, అదానీ కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అమెరికా ఏజెన్సీలు కేసులు పెట్టాయని, అదానీని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. జగన్‌ను, అదానీని ఇద్దరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.