CM Jagan: అమరావతికి జగన్ ఓకే.. బ్యాంకులకు అదే చెప్పారట

టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇళ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది.

Written By: Dharma, Updated On : February 15, 2024 11:38 am

CM Jagan

Follow us on

CM Jagan: అమరావతి విషయంలో జగన్ సర్కార్ వైఖరి మరోసారి బయటపడింది. అక్కడి నిర్మాణాల కోసం బ్యాంకులు ఇచ్చిన రుణ నిబంధనలను అధిగమించేందుకు ఫేక్ పత్రాలను క్రియేట్ చేసింది. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పుకొచ్చింది. ఆ భవనాలు వినియోగిస్తున్నట్లు నమ్మబలికింది.అసలు అమరావతి అంటేనే కస్సుబుస్సు లాడే ప్రభుత్వం.. బ్యాంకు రుణ నిబంధనల కోసం అమరావతి పై ఎనలేని ప్రేమను కనబరచడం విశేషం. అందరూ విస్తు పోయేలా ఓ ఘటన వెలుగు చూసింది.

టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇళ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారీ అపార్ట్మెంట్లను నిర్మించింది. టిడిపి ప్రభుత్వ హయాంలోనే 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలన్నింటినీ పక్కన పెట్టేసింది. అటు కాంట్రాక్టర్లకు డబ్బులు సైతం చెల్లించలేదు. దీంతో ఆ ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కానీ నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోని జగన్ సర్కార్.. అక్కడ నిర్మాణాలు పూర్తయ్యాయని.. అధికారులు ఆ భవనాల్లో ఉంటున్నారని బ్యాంకులకు లేఖలు రాయడం విశేషం. అక్కడితో అది ఆగలేదు. ఆ భవనాలకు అద్దె చెల్లిస్తున్నట్లు చెబుతూ సిఆర్డిఏ ఖాతాలో ఏకంగా 63 కోట్ల రూపాయలు జమ చేయడం విశేషం.

ఈ భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంది. హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలి. లేకుంటే తీసుకున్న రుణం 2000 కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం చెల్లించకపోతే ఎన్పీఏలుగా ప్రకటిస్తారు. అదే జరిగితే ప్రభుత్వం దివాలా తీసినట్టు అవుతుంది. అలాగని బ్యాంకులకు రెండు వేల కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేందుకు జగన్ సర్కార్ ముందుకు రాదు. అందుకే ఇక్కడ తెలివితేటలను ప్రదర్శించింది. ఈ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయని.. అధికారులు కుటుంబాలతో ఉంటున్నారని.. అందుకే అద్దెలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యాంకులకు ఏకంగా రసీదులు పంపించడం విశేషం.

అయితే ప్రభుత్వం అమరావతి నిర్వీర్యం చేసిందన్నది బహిరంగ రహస్యం. వైసీపీ సర్కార్ నేరుగా మూడు రాజధానులను ప్రకటించింది. ఒకరిద్దరు మంత్రులు అమరావతిని స్మశానంతో పోల్చారు. అయినా సరే బ్యాంక్ అధికారులు ప్రభుత్వం పంపిన లేఖకు సంతృప్తి చెందడం విశేషం. చిన్నపాటి ఇల్లు కడితే రుణం ఇచ్చిన పాపానికి సవాలక్ష కొర్రీలు పెడతారు. అటువంటిది 2000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని బ్యాంక్ అధికారులు నమ్మడం విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం కట్టుకథలు సృష్టిస్తుందని తెలుసు. రేపు పొద్దున దీనికి బ్యాంక్ అధికారులే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.