Jagan Mohan Reddy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సార్వత్రికి ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కకావికలం అయ్యింది. ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంతోమంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో నెంబర్ 2 స్థాయి కలిగిన నేతలు సైతం రాజీనామా చేశారు. అయితే ఉన్నవారితోనే రాజకీయం చేసుకుంటానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో పార్టీలో సమూల ప్రక్షాళన చేశారు. కొత్త నియామకాలు చేపడుతున్నారు. ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా వైయస్సార్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన నేతల కోసం ఆరా తీస్తున్నారు. వారి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన నేతల కోసం ఆరా తీస్తున్న జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ పరిణామాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Also Raed : జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’.. టైటిల్ అదుర్స్!
* వందమంది వరకు సలహాదారులు..
2019 ఎన్నికల్లో పనిచేశారని కొందరిని.. తరువాత కాలంలో పనికొస్తారని మరికొందరిని.. పార్టీకి అండగా నిలబడతారని ఇంకొందరినీ సలహాదారులుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). దాదాపు 100 మంది వరకు సలహాదారులు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనిచేశారు. లక్షలాది రూపాయల వేతనాలు, ఇతర అలవెన్స్లతో పాటు వాహన సదుపాయం సైతం వారికి ఉండేది. వారికి ఎటువంటి విధులు ఉండేవి కాదు. కనీసం కార్యాలయం సైతం పనిచేసేది కాదు. కానీ ప్రతి నెల ఒకటో తేదీన వారి అకౌంట్లో గౌరవ వేతనాలు లక్షల రూపాయలు జమయ్యాయి. గత ఐదేళ్ల వైయస్సార్సీపి పాలనలో సలహాదారులకు లక్షలాది రూపాయలు గిట్టుబాటు అయ్యాయి. అయితే గత ఏడాది ఓటమితో ఈ సలహాదారుల జాడ లేకుండా పోయింది. కనీసం తాడేపల్లి ప్యాలెస్ వైపు చూసేవారు కరువయ్యారు. అయితే ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఒక్కసారి నాకు ఫోన్ కలపండి.. అని అధినేత జగన్మోహన్ రెడ్డి కోరితే.. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు సమాచారం. అప్పట్లో వారి నియామకంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎవరు మనకు అక్కడకు వస్తారో? ఎవరు రారో? చూసుకోవాల్సిన పనిలేదా అంటూ రుస రుసలాడినట్లు సమాచారం.
* అప్పట్లో హల్ చల్..
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ మందీ మార్బలం ఉండేది. అందరూ బలంగా కనిపించేవారు. సాక్షి మీడియాలో( Sakshi media) సందడి చేసేవారు కొందరు. సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవారు మరికొందరు. కానీ వారు ఎవరు ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో పదవులు పొందిన వారిలో ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సహా 89 మందిని సలహాదారులుగా నియమించారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీకి అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారు జాడలేదు. అప్పట్లో వారు సలహాలు ఇవ్వలేదు. ఇప్పుడు సలహా ఇవ్వమని కోరినా వారు అందుబాటులో లేరు. పార్టీ పూర్వ వైభవం కోసం అధినేత ప్రయత్నాలు ప్రారంభించారు కానీ.. లక్షలాది రూపాయలు లబ్ధి పొందిన సలహాదారులు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదు. భారీగా జీతభత్యాలు తీసుకున్నా.. కష్టకాలంలో వారి సేవలు లేకపోవడంతో అధినేత సైతం అసహనంతో ఉన్నట్లు సమాచారం.
Also Read : జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. హైకోర్టు కీలక ఆదేశాలు!
* వారంతా సైలెంట్..
జగన్ తాజాగా సంప్రదించిన సలహాదారుల వివరాలు ఇలా ఉన్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడుగా ఉన్న జీవీడి కృష్ణమోహన్, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడుగా ఉన్న దేవులపల్లి అమర్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ గా పనిచేసిన గంగుల కమలాకర్ ను జల వనరుల శాఖ సలహాదారుడుగా అప్పట్లో నియమించారు. మీరు ఎందుకు సైలెంట్ అయ్యారని తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్ తీసినట్లు తెలుస్తోంది. మైనారిటీ సంక్షేమ శాఖకు జియావుద్దీన్, హాజీవుల్లా, మహమ్మద్ అలీ బాగ్దాది, ముద్దు బాలస్వామి అనే నలుగురు సలహాదారులను నియమించారు. వారి జాడ సైతం లేదు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డిని సైతం సలహాదారుడుగా నియమించారు. ఆయన సైతం యాక్టివ్ తగ్గించారు. ఆలూరి సాంబశివారెడ్డిని పాఠశాల విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శిగా నియమించారు. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన విద్యాశాఖ సలహాదారుగా నియమించారు. కానీ ఆయన సైతం ప్రస్తుతం యాక్టివ్ తగ్గించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సలహాదారుగా చల్లా మధుసూదన్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ సలహాదారుగా హాసన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారుగా కృష్ణ జీవిగిరి, ఆర్ వీరారెడ్డి, రాజీవ్ కృష్ణ, మాజీ సిఎస్ నీలం సహానీ, ఆదిత్యనాథ్ దాస్ వంటి వారు సలహాదారులుగా అప్పట్లో నియమింపబడ్డారు. మరి ఇప్పుడు వారి పాత్ర పార్టీలో ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు జగన్. కానీ చాలామంది అందుబాటులోకి రాలేదు. వచ్చినవారు సమాధానం సైతం సహేతుకంగా లేదు.