Jagan Kotamreddy Fallout: ఆయన ఒకప్పుడు వైయస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) నమ్మిన బంటు. ఎంతో ఆరాధ్యంగా ప్రేమించేవాడు. అటువంటి నేతను చేజేతులా దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట్లో నలుసుగా మారారు. చంద్రబాబుకు ఇష్టుడైన నేతగా మారిపోయారు.. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వరుసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సేవ చేస్తే.. తనను పట్టించుకోలేదన్న ఆవేదన శ్రీధర్ రెడ్డి లో ఉంది. అందుకే ఆ పార్టీని వీడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న నెల్లూరు ను.. టిడిపికి పట్టం కట్టేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే టిడిపిలోకి వచ్చినా తాను అనుకున్న మంత్రి పదవిని సాధించలేకపోయారు. నిజంగా అది ఆయనకు లోటే.
Also Read: వైయస్ఆర్సీపీలోకి నేనే వెళ్లొచ్చు.. కూటమి ఖేల్ కథమేనా? జెసి ప్రభాకర్ రెడ్డి అంచనా ఏంటి?
హ్యాట్రిక్ విజయంతో..
వాస్తవానికి మంత్రి పదవి ఇచ్చేందుకు అన్ని అర్హతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి( Kottam Reddy Sridhar Reddy ) ఉన్నాయి. 2014లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. మంచి మెజారిటీతో గెలిచారు కోటంరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడైన ఎమ్మెల్యేగా ఉండేవారు. టిడిపి నుంచి ప్రలోభాలు వచ్చినా ఎన్నడు పార్టీ లైన్ దాటలేదు. 2019లో రెండోసారి గెలవడంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎగిరేసుకుపోయారు. పోనీ విస్తరణలో దక్కుతుందనుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. దీనికి తోడు పార్టీలో సైతం తనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికలు ఇంకా 16 నెలలు ఉండగానే అసంతృప్తి స్వరం వినిపించి అప్పటి వైసిపి ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
జగన్ అన్యాయం చేశారని ఆవేదన..
జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉన్నతికి తాను పాటుపడితే.. తన విషయంలో మాత్రం అన్యాయం చేశారని భావించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అందుకే ఎన్నికలకు ముందు టిడిపి తరఫున బలంగా పనిచేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కార్యక్రమాలను నిబద్దతతో పూర్తి చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ వద్ద కూడా మంచి పరపతి ఉంది. అయితే అది మంత్రి పదవి ఇచ్చేదాకా ఉందా అంటే మాత్రం చెప్పలేం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే నారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన అమరావతి బాధ్యతలను చూస్తున్నారు. మరో మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. దీంతో ఆయనను తప్పించడం కుదిరే పని కాదు. అందుకే కోటంరెడ్డికి మంత్రి పదవి విషయంలో ఎవరు గ్యారెంటీగా చెప్పలేకపోతున్నారు.
Also Read: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో కొత్త స్కీమ్!
నెల్లూరు జిల్లా పర్యటనకు అడ్డంకి
అయితే తాజాగా తన పూర్వ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా( Nellore district) పర్యటనకు వస్తున్నారు. అయితే జగన్ పర్యటనను కోటంరెడ్డి అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హెలిక్యాప్టర్ పై వస్తుండడంతో హెలిపాడ్ కోసం స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెతుకులాట ప్రారంభించారు. నెల్లూరు జిల్లాతో పాటు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా వారికి స్థలం దొరకడం లేదంటే.. దానికి కారణం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటూ వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి టిడిపి కూటమి అధికారంలోకి వస్తే కోటంరెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న హామీ ఉంది. అందుకే జిల్లాలో ఆయన ఈ తరహా దూకుడు రాజకీయాలు చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే తన ఆరాధ్య నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి కోటంరెడ్డి చుక్కలు చూపిస్తున్నారన్నమాట.