Jagan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు చదువుతున్న సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని హాస్పిటల్ పాలయ్యాడనే విషయం తెలియడం తో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఈ అంశం గురించే చర్చలు జరుపుతున్నారు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియా కు మార్క్ శంకర్ ఆరోగ్యం గానే ఉన్నాడని, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం శస్త్ర చికిత్స చేస్తున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అరకు పర్యటనలో ఉన్నాడు. అక్కడ రచ్చబండ ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేడు ఆయన మొదలు పెట్టాడు. ఇకపోతే కాసేపటి క్రితమే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) జరిగిన ఈ ప్రమాదంపై స్పందించాడు.
Also Read: అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు.. సింగపూర్‌లో ఘటన.. ఏం జరిగిందంటే.
ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని షాక్ కి గురయ్యాను. ఈ కష్టతరమైన పరిస్థితి లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ధైర్యం గా ఉండాలని కోరుకుంటున్నాను. మార్క్ శంకర్(Mark Shankar) త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ అటు వైసీపీ అభిమానులను, ఇటు జనసేన అభిమానులను సర్ప్రైజ్ చేసింది. మాజీ సీఎం జగన్ నుండి ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ గురించి వేసిన మొట్టమొదటి ట్వీట్ ఇదే. వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది, పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి కూడా జగన్ కి ఇష్టం ఉండదు వంటివి మీడియా లో ప్రచారం అవుతూ ఉండేవి. ఇలాంటి సమయంలో ఇలా స్పందించడం నిజంగా అందరికీ పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కొడుకు కి జరిగిన ప్రమాదం పై స్పందించారు. ఇకపోతే అరకు లో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా విశాఖపట్నం కి చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక విమానం లో సింగపూర్ కి పయనం అవ్వబోతున్నాడు. మళ్ళీ ఆయన ఎప్పుడు తిరిగి ఆంధ్ర ప్రదేశ్ కి వస్తాడు వంటి వాటిపై ఎలాంటి సమాచారం లేదు. ఏది ఏమైనా మాజీ సీఎం జగన్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో నిత్యం గొడవలు పడే వైసీపీ, జనసేన పార్టీ అభిమానుల మధ్య కాస్త శాంతి వాతావరణం ఏర్పడేలా చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జగన్ పై సానుకూలంగా స్పందించారు.