Jagan: జగన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు.రాజకీయంగా కంటే వ్యక్తిగతంగా తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నారు.మరోవైపు చంద్రబాబు భయంకరమైన ప్రకటనలు చేస్తున్నారు.వైసిపి భూతాన్ని భూస్థాపితం చేస్తానని చెప్పుకొస్తున్నారు.దీంతో జగన్ కు టెన్షన్ పట్టుకుంది. గత ఐదేళ్లుగా చంద్రబాబును ఏ స్థాయిలో వెంటాడారో జగన్ కు తెలియంది కాదు. అందుకే ఇప్పుడు తనను తాను కాపాడుకోవడం జగన్ ముందున్న కర్తవ్యం. పార్టీని కాపాడుకోవడం అన్నది తరువాయి.ప్రధానంగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, అవినీతి కేసులు, బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జగన్ లో ఆందోళనకు కారణం అవుతోంది.
అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా.. కేంద్ర పెద్దల సహకారంతో జాప్యం చేయిస్తూ వచ్చారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉంది.ఆ పార్టీ మద్దతు లేనిదే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగదు. రాష్ట్రంలో తన ప్రత్యర్థిగా ఉన్న జగన్ ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారు. అది కామన్ కూడా. జగన్ అవసరం లేనప్పుడే.. చంద్రబాబుపై ఉన్న కోపంతో రాష్ట్ర ప్రభుత్వానికి బిజెపి పెద్దలు అన్ని విధాలా సహకారం అందించారు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం నిలబడాలంటే టిడిపి కీలకం.చంద్రబాబు సిఫార్సులకు పెద్దపీట వేయాలి.ఇప్పుడు జగన్ లో ఆందోళనకు ఇదే కారణం.అందుకే కేంద్ర ప్రజలకు ఎలాగైనా టచ్లోకి వెళ్లాలని జగన్ చూస్తున్నారు.ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన తనకు ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాడు కేంద్ర పెద్దలను కలుసుకునేందుకు నాలుగు సంవత్సరాల సమయం పట్టింది. రాజకీయంగా దెబ్బతింటే కేంద్ర పెద్దలు కనీస పరిగణలోకి తీసుకోరు.నాడు చంద్రబాబు కేంద్ర పెద్దలను కలుసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా సరే వారు కనికరించలేదు. ఇప్పుడు జగన్ ను కనికరిస్తారంటే ఆ పరిస్థితి ఉండదన్న సమాధానం వినిపిస్తోంది.అప్పట్లో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కింది. కానీ ఇప్పుడు జగన్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో కేంద్ర పెద్దలు దగ్గరకు కూడా చేరనివ్వరు. ఆ విషయం జగన్ కు సైతం తెలుసు. అందుకే ఇప్పుడు ఏపీలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని.. చిన్నచిన్న నేరాలను రాజకీయ గొడవలుగా మార్చి వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని.. తనకు అపాయింట్మెంట్ ఇస్తే అన్ని వివరిస్తానని ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే జగన్ లో రాష్ట్ర ప్రయోజనాల కంటే.. తన వ్యక్తిగత కేసుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుని.. ఆయనను కలవడం ద్వారా కొన్ని వ్యవస్థలను ఆయన ప్రభావితం చేసే ప్లాన్ లో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తనపై మోడీకి ఇంకా అభిమానం ఉందని సంకేతాలు పంపించేందుకే ఈ తరహా ప్రయత్నాలు జగన్ చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి.
గత ఐదేళ్ల వైసిపి విధ్వంస పాలనపై సమగ్ర సమాచారం కేంద్రం వద్ద ఉంది. ఏపీ ఏ స్థాయిలో నష్టపోయిందో కేంద్ర పెద్దలకు తెలుసు.అటువంటి జగన్ కు మరోసారి మోదీ ప్రోత్సహిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. పైగా కేంద్రంలో ఇప్పుడు టిడిపి కీలకం. తెలుగుదేశం పార్టీ మద్దతు లేనిదే ఎన్డిఏ ముందుకెళ్లలేని పరిస్థితి.పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును వదులుకుంటే ఇండియా కూటమి బలపడుతుంది.అందుకే నమ్మదగిన మిత్రుడిని వదులుకొని.. భవిష్యత్తులో బలం వస్తుందనుకున్న జగన్ ను కేంద్ర పెద్దలు నమ్మేస్థితిలో మాత్రం లేరు. పైగా ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే బిజెపి బలపడేది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బిజెపి అధికారంలోకి రాగలుగుతోంది. ఇన్ని పరిణామాల క్రమంలో జగన్ ను ప్రధాని మోదీ మళ్లీ చేరదీస్తారనుకుంటే పొరబడినట్టే.