Jagan: జగన్ కి కోర్టుల షాక్

2014 నుంచి 2019 వరకు జగన్ ఏపీకి విపక్షనేతగా వ్యవహరించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన పై అవినీతి కేసులు సిబిఐ కోర్టులో విచారణ చేపడుతుండేవారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 9:24 am

Jagan

Follow us on

Jagan: ఈ ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు న్యాయస్థానాలు షాక్ ఇస్తున్నాయి. జగన్ పై అవినీతి కేసులతో పాటు కోడి కత్తి దాడి వంటి కేసులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ విపక్ష నేతగా ఉన్నంతవరకు అవినీతి కేసుల్లో ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో బిజీ కావడంతో.. తనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులకు విన్నవించారు. దీంతో మినహాయింపు లభించింది. అయితే ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో కోర్టులకు హాజరు కావాల్సిన పరిస్థితి దాపురించింది.

2014 నుంచి 2019 వరకు జగన్ ఏపీకి విపక్షనేతగా వ్యవహరించారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయన పై అవినీతి కేసులు సిబిఐ కోర్టులో విచారణ చేపడుతుండేవారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాల్సిందే నన్న ఆదేశాలు ఉండేవి. అందుకే జగన్ ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా తప్పకుండా కోర్టుకు హాజరవుతూ వచ్చారు. చివరకు పాదయాత్ర సైతం వారంలో రెండు రోజుల పాటు నిలిపి వేసేవారు. ప్రతి శుక్రవారం హైదరాబాదులోని సిబిఐ కోర్టుకు హాజరయ్యేవారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని.. కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపం మేరకు గత ఐదు సంవత్సరాలుగా హాజరు విషయంలో మినహాయింపు లభించింది.

ఒక్క అవినీతి కేసుల్లోనే కాదు. తనపై జరిగిన దాడి కేసులో సాక్షిగా హాజరయ్యేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు. పాదయాత్ర చేస్తూ సి.బి.ఐ కోర్టుకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ వెళుతుండగా కోడి కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ ఎయిర్పోర్టులో శీను అనే యువకుడు దాడి చేశాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇందులో కుట్ర కోణం ఉందని జగన్ ఆరోపణలు చేశారు. అయితే అటువంటిదేమీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. అయితే లోతైన దర్యాప్తు జరపాలని జగన్ కోర్టుకు విన్నవిస్తూ వచ్చారు. కానీ సాక్షిగా ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ఫలితంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న శీను ఐదేళ్లపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దేశ చరిత్రలో ఒక కేసులో నిందితుడు ఐదేళ్లపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోవడం రికార్డ్. అయితే ఇప్పుడు ఈ కేసులో సైతం జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. కొద్ది రోజుల కిందటే కోడి కత్తి నిందితుడికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సీఎంగా కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు వచ్చినా.. ఇప్పుడు అధికారానికి దూరం కావడంతో హాజరు తప్పనిసరి అయ్యింది.