AP MLC Elections: ఏపీలో మరో ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈనెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై రెండు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 3న స్క్రూట్నీ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూలై 5. అదే నెల 12న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. ఆరోజు సాయంత్రమే ఫలితాలను వెల్లడిస్తారు.
ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో శాసనమండలి చైర్మన్ వారిపై అనర్హత వేటు వేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసిపి ఫిర్యాదు చేసింది. అందుకే వారిపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. ఆ రెండు స్థానాల భర్తీకి ఈసీ ఉపక్రమించింది. ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. ఈ రెండు స్థానాలను సైతం ఏకపక్షంగా గెలుచుకునే ఛాన్స్ ఉంది. కనీస స్థాయిలో కూడా శాసనసభ్యులు లేకపోవడంతో వైసిపి పోటీ పెట్టే పరిస్థితి కనిపించడం లేదు.
కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు వైసిపి హై కమాండ్ ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ ను ఆశించారు. దక్కకపోయేసరికి టిడిపిలో చేరారు. అనర్హత వేటుకు గురయ్యారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఆయనకే ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి. మరో ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురం నియోజకవర్గానికి చెందినవారు.గత ఎన్నికల్లో బాలకృష్ణ ఓడించేందుకు ఇక్బాల్ సేవలను వాడుకుంది వైసిపి. ఆయనకు ఏకంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఈ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికలకు ముందు ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. దీంతో మనస్థాపానికి గురైన ఇక్బాల్ టిడిపిలో చేరారు. బాలకృష్ణ విజయానికి కృషి చేశారు. ఇప్పుడు ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? వేరొకరికి ఛాన్స్ ఇస్తారా? అన్నది చూడాలి.