Jagan: జగన్ ని పులివెందుల ఎలా చూస్తుందో?

రాష్ట్రస్థాయిలో గెలుపోటములను పక్కన పెడితే.. వైయస్ ముందు.. వైయస్ మరణం తర్వాత జగన్ కు కడప జిల్లా అండగా నిలబడింది. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు జగన్.

Written By: Dharma, Updated On : June 19, 2024 9:28 am

Jagan

Follow us on

Jagan: కడప అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్సార్ కుటుంబం. నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లా వైఎస్ కుటుంబం కనుసన్నల్లో ఉండేది. అటువంటిది ఈసారి ఆ కోటకు బీటలు వాలాయి. వైసిపి ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను.. కేవలం 3చోట్ల మాత్రమే విజయం సాధించింది. మిగతా ఏడింట టిడిపి కూటమి స్పష్టమైన మెజారిటీతో గెలిచింది. పులివెందులలో సైతం మెజారిటీ తగ్గింది. కడప పార్లమెంట్ స్థానం కేవలం 60 వేల ఓట్లతో మాత్రమే అవినాష్ రెడ్డి గెలుపొందగలిగారు. ఒకరకంగా చెప్పాలంటే వైసిపికి ఇది గడ్డుకాలం. ఒకవైపు జగన్ ఓటమిపై సమీక్షిస్తుండగా.. ఈరోజు పులివెందుల వెళ్తున్నారు. ఓ సామాన్య ఎమ్మెల్యేగా అడుగుపెడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఎలా చూస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్రస్థాయిలో గెలుపోటములను పక్కన పెడితే.. వైయస్ ముందు.. వైయస్ మరణం తర్వాత జగన్ కు కడప జిల్లా అండగా నిలబడింది. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు జగన్. వైసీపీని ఏర్పాటు చేసి కడప ఎంపీగా పోటీ చేశారు. కనీ విని ఎరుగని రీతిలో ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేశారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో స్వీప్ చేశారు. పార్లమెంట్ స్థానాన్ని లక్షలాది ఓట్ల మెజారిటీతో సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో సైతం పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకున్నారు. పార్లమెంట్ స్థానాన్ని లక్షలాది ఓట్ల మెజారిటీతో దక్కించుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలను వదులుకున్నారు. తక్కువ మెజారిటీతో కడప పార్లమెంటు స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈరోజు సాయంత్రం జగన్ పులివెందుల వెళ్ళనున్నారు. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 21 వరకు అక్కడే ఉండనున్నారు. కడప జిల్లాలో ఈ పరిస్థితికి ముమ్మాటికి కారణం వివేకానంద రెడ్డి హత్య. వైయస్ షర్మిల తో పాటు సునీత ఎదురు తిరగడం, వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైయస్ కుటుంబ చరిత్ర మసకబారింది. ఒకప్పుడు జగన్ పులివెందులలో అడుగుపెడతారంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. ప్రజలు సైతం దేవుడులా కొలిచేవారు. ఆయన కోసం ఎదురుచూసేవారు. కానీ సీన్ మారింది. టిడిపి కూటమి ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పుడు జగన్ పూర్వవైభవానికి ఎలా కృషి చేస్తారన్నది ప్రశ్నగా మిగిలింది.