Jagan And BJP: రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అత్యంత సాహసం కూడా. చాలా రకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )డిఫెన్స్ లో పడిపోతున్నారు. ఏ నిర్ణయం కూడా సవ్యంగా తీసుకోలేకపోతున్నారు. మునుపటి దూకుడు ఆయనలో కనిపించడం లేదు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి ఆశించారు జగన్మోహన్ రెడ్డి. ఆ పదవి ఇవ్వకపోయేసరికి పార్టీపై తిరుగుబాటు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు అజయమైనా శక్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అయినా సరే ఆ శక్తిని ఢీకొట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అంతటి శక్తిగా ఉన్న బిజెపిని చూసి మాత్రం భయపడి పోతున్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. స్నేహం కోసం వస్తున్న వారిని దూరం పెడుతున్నారు. ఇష్టమైన వారితో కలవలేక పోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భావోద్వేగాలను సైతం వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు.
* ప్రతిపక్షానికి తోడు అవసరం..
సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారికి ఏ చిన్నపాటి తోడు దొరికినా వదలరు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయ పార్టీలను కలుపుకెళ్లే ప్రయత్నం చేయలేకపోతున్నారు. దానికి కారణం భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) . జాతీయస్థాయిలో ఆ పార్టీకి ఎదురు నిలిచే ఏ పార్టీ కూడా నిలవడం లేదు. అందుకే జగన్ తన పార్టీ కోసం.. తన పార్టీ అస్తిత్వం కోసం బిజెపితో వ్యతిరేకత తెచ్చుకోవడం లేదు. చివరకు బిజెపిని వ్యతిరేకించే పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఏపీలో మూడు పార్టీలు పొత్తులో ఉండగా.. మిగిలినవి కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ఉనికి లేని పార్టీలు. తనకు తాను పెద్ద పార్టీగా చెప్పుకునే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటిని కలుపు కెళ్లే సాహసం చేయడం లేదు. దానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లడమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఏ పనికి కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ని సింహం, ఢిల్లీని గడగడ లాడించిన నాయకుడు వంటి స్లొగన్స్ తో ఆకాశానికి ఎత్తేస్తుంటారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు బీజేపీ విషయంలో తమ అధినేత అనుసరిస్తున్న వైఖరి వారికి సైతం మింగుడు పడడం లేదు.
* వైసిపి లైన్ లోకి వామపక్షాలు..
ఇటీవల ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges) ప్రైవేటీకరణ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనను తీవ్రతరం చేసింది. అదే అంశంపై సిపిఐ పోరాటం చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని అభినందిస్తోంది. అయితే సిపిఐ వైఖరి చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేయాలని అనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి పిలుపు లేదు కదా.. సంకేతాలు కూడా లేవు. ప్రజల్లో మార్పు ప్రారంభమైందని జగన్ అంచనాలు వేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. కానీ కొన్ని వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అసంతృప్తితో ఉన్నాయని.. ఆగ్రహంతో ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు విషయంలో బిజెపి వైఖరి వేరేలా ఉండేది. ఎప్పుడైతే పవన్ ముందుకు వచ్చి టిడిపి తో పొత్తు ప్రకటన చేశారో.. క్రమేపి బిజెపి వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా సిపిఐ ద్వారా మిగతా రాజకీయ పక్షాలను తన వైపు తెచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. కానీ బిజెపి విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. ఇలా ఆలోచనకు వెళ్తే మాత్రం చాలా కష్టం.