Tammineni Sitaram: అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు షాక్ ఇచ్చారు జగన్. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేని సీతారాం కు తప్పించారు. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చింతాడ రవికుమార్ కు ఆ పదవి ఇచ్చారు. దీంతో తమ్మినేని కి ఘోర అవమానం జరిగినట్టే. ఈ ఎన్నికల్లో ఆమదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తమ్మినేని. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇటీవల వైసిపిలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కీలక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చుతున్నారు. అందులో భాగంగానే ఆముదాలవలసలో తమ్మినేనిని తప్పించారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించారు చింతాడ రవికుమార్. కానీ అనూహ్యంగా తమ్మినేని సీతారాంకు ప్రాధాన్యం ఇస్తూ టిక్కెట్ కేటాయించారు జగన్. ఎన్నికల్లో తమ్మినేని ఓడిపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ నెలకొంది. ఇప్పుడు తమ్మినేని తప్పించి రవికుమార్ కు ఆ బాధ్యతలు అప్పగించడం విశేషం.దీంతో తమ్మినేని రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. తాను తప్పుకొని కుమారుడికి అవకాశం ఇవ్వాలని సీతారాం భావించారు. కానీ జగన్ మాత్రం తమ్మినేని సీతారాం కుమారుడికి సైతం పరిగణలోకి తీసుకోలేదు.
* సుదీర్ఘ నేపథ్యం
తమ్మినేని సీతారాం ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం.తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు ఆయన.ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గా 1980లో నియమితులయ్యారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983 నుంచి1999 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఐదు సార్లు వరుసగా ఎన్నికై రికార్డ్ సృష్టించారు. 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్లు,శాప్ డైరెక్టర్ గా మూడేళ్లు సేవలు అందించారు.
* తప్పటడుగులు
రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో తప్పటడుగులు వేశారు తమ్మినేని సీతారాం. 2009లో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. చిరంజీవి నేతృత్వంలోనూ ఏర్పాటు అయిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కొద్ది రోజులకే తిరిగి టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చారు.వైసీపీ ఆవిర్భావంతో మరోసారి ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా ఎంపికయ్యారు. ఈ ఎన్నికల్లో మూడోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కు టికెట్ ఇవ్వొద్దని సొంత పార్టీ శ్రేణులే హై కమాండ్ ను కోరాయి. అయినా సరే జగన్ సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చి తమ్మినేనికి టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయన ఓటమి చవిచూశారు. ఆయనపై గెలిచిన కూన రవికుమార్ స్వయానా మేనల్లుడు. ఆమదాలవలసలో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి చెప్పాలని భావించి జగన్ చింతాడ రవికుమార్ ను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం పై తమ్మినేని సీతారాం ఎలా స్పందిస్తారో చూడాలి.