CM Chandrababu: ఏపీలో శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఉభయ సభల్లో చీఫ్ విప్ ల పేర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. అక్కడ సమన్వయం కోసం విప్ ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. ముందుగా అక్కడ పదవులు భక్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, కూన రవికుమార్, బెందాలం అశోక్ పేర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ధూళిపాళ్ల నరేంద్ర పేరు బయటకు వచ్చినా.. గుంటూరు జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. మరొకరు కేంద్ర మంత్రిగా ఉండడంతో సామాజిక సమీకరణల దృష్ట్యా నరేంద్ర పేరు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శాసనసభలో విప్ లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. జనసేన నుంచి మూడో విప్ గా పోలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
* శాసనమండలిలో
శాసనమండలిలో చీఫ్ విప్ లుగా టిడిపి ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒకరు చీఫ్ విప్ అయితే.. మరొకరిని విప్ గా నియమిస్తారని సమాచారం. మరో ఇద్దరు సభ్యులకు సైతం విప్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే అందులోజనసేన నుంచి ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది.ప్రధానంగా హరిప్రసాద్ పేరు వినిపిస్తోంది.
* ఈనెల 22 వరకు సమావేశాలు
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్ననే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈనెల 22 వరకు సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలను సైతం తీసుకున్నారు. మరోవైపు శాసనమండలి బిఎసి సమావేశం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ, రవిబాబు, పిడిఎఫ్ పక్ష నేత లక్ష్మణరావు హాజరయ్యారు. పలు అంశాలను చర్చించేందుకు చైర్మన్ ఓకే చెప్పారు.