CM Jagan: ఇప్పటినుంచి చెల్లెమ్మకు బడైనా.. గుడైనా ఇంటి వద్దే.. చంటి సినిమాలో జమీందారులైన అన్నదమ్ములు ఇచ్చే ఆదేశాలు ఇవి. ఇప్పుడు జగన్ ఇదే తరహా ఆలోచనలతో ముందుకు సాగడం విశేషం. ఏకంగా సంక్రాంతి సంబరాలు తన ప్యాలెస్ లోనే భారీ సెట్టింగ్ వేసుకుని జరుపుకోవడం.. అందుకు ప్రజాధనాన్ని ఉపయోగించడం.. సీఎం దంపతులను రంజింప చేసేందుకు తిరుమల తరహాలో వేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడ వినోదం పంచాల్సిన కళాకారులు సీఎం జగన్ కు ఆనందాన్ని అందించి తిట్ల దండకం అందుకోవడం విశేషం.
ఎవరైనా పండగ వస్తే గుడికి వెళ్తారు. కానీ గుడినే తన ఇంటికి రప్పించుకున్నారు సీఎం జగన్. సాధారణంగా గ్రామాలకు వెళ్లి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆనవాయితీని ఎప్పుడూ జగన్ గౌరవించిన దాఖలాలు లేవు. కానీ ఇది ఎన్నికల ఏడాది కావడంతో తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో భారీ సెట్ వేశారు. మంచి మంచి కళాకారులను తెప్పించారు. వారితో వినోదం పేరిట చంద్రబాబును తిట్టించారు. తాము సంక్రాంతి సంబరాల్లో ఉన్నామని మరిచిపోయిన కళాకారులు జగన్ కు ఏది నచ్చుతుందో ఎంచుకొని మరి పాటలు పాడారు.. మిమిక్రీ చేశారు. సీఎం దంపతుల కళ్ళల్లో ఆనందం నింపారు. పెదవుల్లో నవ్వులు పూశారు.
చంద్రబాబును తిట్టిన ప్రతిసారి జగన్ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. సంక్రాంతి సంబరాలు చూసేందుకు వచ్చిన వారికి మాత్రం మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రతిదానికి చంద్రబాబు మీద పడి ఏడవడం.. దేవుడు కోసం చేసిన ఏర్పాట్లలోనూ అదే ఉండడం.. ఘోరమైన మానసిక స్థితికి అద్దం పట్టింది. ఇవన్నీ తన ఖర్చులతో చేసుకునే ఉంటే రాజకీయంగా ఎన్ని వికృత చర్యలు, వినోదాలు చేసుకున్నా అడిగే వారు ఉండేవారు కాదు. ప్రభుత్వ ధనంతో సంక్రాంతి సంబరాలు చేసుకోవడం.. అందులోనూ రాజకీయాలు వెతుక్కోవడం చూస్తుంటే మాత్రం ఇబ్బందికరం. పైగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే జాడ లేని సీఎం సతీమణి భారతి. ఈ భారీ సెట్ లో మాత్రం హిందూ గృహిణిగా కనిపిస్తూ హడావిడి చేయడం.. అసలు సిసలు రాజకీయాన్ని తెలియజేస్తోంది.