Balineni Srinivasa Reddy: బాలినేని బ్లాక్ మెయిల్.. జగన్ రియాక్షన్ ఏంటో?

వైఎస్ కుటుంబానికి బాలినేని అత్యంత విధేయుడు. దగ్గర బంధువు కూడా. మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉండేది.

Written By: Dharma, Updated On : January 16, 2024 9:28 am

Balineni Srinivasa Reddy

Follow us on

Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వైసీపీని వీడలేక.. వేరే పార్టీలో చేరలేక.. తనలో తానే సతమతమవుతున్నారు. హై కమాండ్ కు లేనిపోని షరతులు విధిస్తున్నారు. చికాకు పెడుతున్నారు. అందుకే జగన్ సైతం బాలినేని విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కానీ బాలినేని వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. ఆయన చికాకు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాలినేని ముఖం చూసేందుకు కూడా జగన్ ఇష్టపడడం లేదు.

వైఎస్ కుటుంబానికి బాలినేని అత్యంత విధేయుడు. దగ్గర బంధువు కూడా. మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడానికి స్వేచ్ఛ ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు జగన్ ను కలిసేవారు. కానీ ఇప్పుడు గ్యాప్ వచ్చింది. కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా బాలినేనికి లభించడం లేదు.మొన్నటికి మొన్న సీఎంను కలిసేందుకు వెళితే మూడు రోజులు వేచి చూడక తప్పలేదు. అయినా సరే సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో తిరిగి అలిగి వెళ్లిపోయారు.

ఏటా సంక్రాంతి వేడుకలు ఒంగోలులో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం బాలినేని హైదరాబాద్ కు పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గానికి చేరుకోలేకపోయారు. డిసెంబర్ 12న జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న ఆయన ఒంగోలుకు దూరమయ్యారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి టచ్ లో ఉన్నారు.కానీ ఆయనకు అనుకూల ప్రకటనలు ఏవీ రావడం లేదు. తనతో పాటు ఎంపీ మాగుంటకు టికెట్ కన్ఫర్మ్ చేయడం లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పార్టీని వీడేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. అయినా సరే ఆయనకు స్వాగతించే పార్టీలు లేకపోవడం విశేషం.

తాజాగా ఆయన కుమారుడు కీలక ప్రకటన చేశారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. వాటి కోసమే ఆయన వేచి ఉన్నారని.. రెండు రోజుల్లో రూ. 170 కోట్లు విడుదలవుతాయని సమాచారం ఉన్నట్లు బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ప్రకటించారు. ఆ నిధులు విడుదల తరువాతే తన తండ్రి ఒంగోలు వస్తారని చెప్పుకొచ్చారు. సంక్రాంతి సంబరాల్లో తండ్రి బదులు కుమారుడు పాల్గొన్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తరహాలో ఉంది. అయితే ఇటువంటి వాటికి జగన్ సమ్మతిస్తారా? లేదా? అన్నది చూడాలి.