Jagan Chittoor Visit: మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ బల ప్రదర్శనకు దిగింది. తాను చేస్తున్న పర్యటనలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నా.. జగన్మోహన్ రెడ్డి లెక్క చేయడం లేదు. పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. గత అనుభవాల దృష్ట్యా చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి పోలీసులు చాలా రకాల ఆంక్షలు విధించారు. అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల సందర్శనకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి. హెలిపాడ్ కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఉన్నా.. వందలాదిమంది గుమిగూడారు. భారీ బైక్, కార్లతో ర్యాలీగా బయలుదేరారు.
గత అనుభవాల దృష్ట్యా..
సత్యసాయి( Satya Sai ), పల్నాడు జిల్లాల్లో ఎదురైన పరిణామాలు దృష్ట్యా చిత్తూరు పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సింగయ్య అనే వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయాడు. మరో ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మూలంగా చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి నేరుగా వారిని పరామర్శించేందుకు బయలుదేరారు. అయితే సీజన్ దాటిన తర్వాత పరామర్శ ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది. కేవలం ఇది రాజకీయ కోణంలో చేస్తున్న పర్యటనగా మిగతా రాజకీయ పక్షాలు అభివర్ణిస్తున్నాయి. కానీ జగన్ ఇవేవీ పట్టించుకోలేదు.
Also Read: వైసిపి పరిస్థితే కూటమికి ఎదురవుతోందా?
ఎస్పీ ఆదేశాలు బేకాతరు
మరోవైపు నిన్ననే చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ( Chittoor district SP Manikanta) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జగన్ పర్యటనలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలా నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. కానీ కనీస స్థాయిలో కూడా వైసిపి నేతలు దీనిని పట్టించుకోలేదు. భారీగా జన సమీకరణ చేశారు. అడుగడుగునా ఆంక్షలు అధిగమించారు. బంగారుపాళ్యంలోని మార్కెట్ యార్డులో 500 మందికి మించి ఉండకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. కానీ వేలాది మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుగానే మార్కెట్ యార్డులోకి చొచ్చుకొచ్చాయి. మరోవైపు భారీగా జన సమీకరణ నడుమ కాన్వాయ్ నడుస్తుండగా.. విజయానంద రెడ్డి అనే వైసీపీ నేత కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురయింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.