Jagan Bus Yatra: దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండడం ఏపీలో నేతలకు వరంలాగా మారింది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు అంది వచ్చిన అవకాశం లాగా పరిణమించింది. ఎన్నికల షెడ్యూల్ కు, పోలింగ్ కు మధ్య దాదాపుగా రెండు నెలల సమయం ఉంది. ఇంతటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వైసీపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రను తెరపైకి తీసుకువచ్చారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్న రోడ్డు సమస్యలు తర పైకి వస్తాయని భావించి వైసీపీ నాయకులు వినూత్నంగా ఆలోచించారు.
జగన్ యాత్ర ద్వారా ఏపీలో రోడ్ల దుస్థితి వెలుగులోకి వస్తే ఎన్నికల ముందు ఇబ్బందవుతుందని వైసీపీ నాయకులు మదన పడుతున్నారు. అందువల్లే వారు పార్టీకి నష్టం కలగకుండా ఒక ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం జాతీయ రహదారులపైనే జగన్ బస్సు యాత్ర జరిగేలాగా షెడ్యూల్ రూపొందించినట్టు సమాచారం. ఒకవేళ రాష్ట్ర రహదారుల మీదకు జగన్ యాత్ర సాగితే.. అక్కడ రోడ్లకు ప్యాచ్ వర్క్ చేస్తారని తెలుస్తోంది. జగన్ ఉపయోగించే బస్సు ఆర్టీసీ నుంచి అద్దెకి తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఈ బస్సును 20 కోట్లకు ఆర్టీసీ కొనుగోలు చేసింది. అతి తక్కువ ధరకు ఆ బస్సును అద్దెకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ ఎక్కడైనా రోడ్డు గుంతల్లో, లేదా బస్సు ఆగిపోతే యాత్రకు, ప్రభుత్వ పరిపాలనకు డ్యామేజ్ జరుగుతుంది. అందువల్లే ముందు జాగ్రత్తగా వైసీపీ నాయకులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి బస్సుయాత్ర మొదట్లో వద్దనుకున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరవుతోందని వైసీపీ నాయకులు అంటున్నారు.. ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలవడంతో పాటు, కింది స్థాయి కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఉపకరిస్తుందని వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఇదే తీరుగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన పాదయాత్ర కూడా నిర్వహించారు.. పాదయాత్ర సందర్భంగా ప్రజలు ఆయనకు భారీగా స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా ఆయనకు ప్రజలు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. మళ్లీ ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నారు. అప్పుడు పాదయాత్ర ఆయనను అధికారానికి దగ్గర చేసింది. మరి ఇప్పుడు ఈ బస్సు యాత్ర ఆయనను మళ్ళీ అధికారంలోకి తీసుకెళ్తుందా? లేదా? అనే ప్రశ్నలకు మరికొద్ది రోజులు ఆగితే స్పష్టమైన సమాధానం లభిస్తుంది.