BJP TDP Alliance: బిజెపితో పొత్తు టిడిపి శ్రేణులకు ఇష్టం లేదా? కొన్ని నియోజకవర్గాల్లో ఆశలు వదులుకోవాల్సిందేనా? ముస్లిం, మైనారిటీ ఓటు బ్యాంకు శత శాతం దూరమవుతుందా? అసలు బిజెపి పొత్తుకు ఒప్పుకున్నది ఎందుకు? ఇలా రకరకాల చర్చలు ఏపి పొలిటికల్ సర్కిల్లో బలంగా నడుస్తున్నాయి.ఏపీ విషయంలో బిజెపి ఆలోచన ఏమిటన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. ఇన్ని రోజులు పొత్తుల కోసం ప్రయత్నించిన చంద్రబాబుకు మోకాల డ్డిన బిజెపి అగ్రనేతలు.. ఉన్నఫలంగా ఒప్పుకోవడంపై రకరకాల అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
ఏపీ విషయంలో బిజెపి ఆలోచన ఏంటన్నది అంతు పట్టడం లేదు. ఇప్పుడు ఉన్నఫలంగా జగన్ గద్దె దిగి.. చంద్రబాబు అధికారంలోకి రావాలన్నది బిజెపి ఆలోచన కాదు. 2014 నుంచి 2019 వరకు కలిసి ప్రయాణించాల్సిన చంద్రబాబు ఉన్నపలంగా బిజెపికి దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటివరకు బిజెపికి సహకరిస్తూనే ఉన్నారు. నాడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన చంద్రబాబు బిజెపిని దెబ్బతీయాలని చూశారు. కానీ జగన్ ఎన్నడు బిజెపికి పల్లెత్తు మాట అనలేదు. రాజకీయంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయలేదు. మరి ఈ లెక్కన చంద్రబాబు కంటే జగనే బిజెపికి బెటర్. కానీ బిజెపి మాత్రం టిడిపి వైపు వచ్చింది. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు గత నెలలో అగ్రనేత అమిత్ షాను కలిసి వచ్చారు. వెనువెంటనే జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ తో మాట్లాడి వచ్చారు. అయితే తాను ఎన్డీఏలో చేరుతానని చెప్పడం కంటే.. చంద్రబాబును చేర్చుకోవాలని సూచించి వచ్చి ఉంటారని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. అప్పుడే తనకు ఏపీలో సంపూర్ణ విజయం దక్కుతుందని.. ఎన్నికల అనంతరం ఇదే తరహా సాయం కొనసాగుతుందని.. కేంద్ర పెద్దలకు జగన్ ఒప్పించినట్లు వైసీపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ పొత్తుల వ్యవహారం వెనుక పవన్ కృషి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకు విరుగుడుగా వైసీపీ శ్రేణులు ఈ తరహా ప్రచారానికి దిగాయా? లేకుంటే వారు చెబుతున్నట్లు వ్యూహం ఉందా? అన్న అనుమానం అయితే కలుగుతోంది.
బిజెపి అంటే ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉంది. మత ప్రాతిపదిక రాజకీయాలు బిజెపి చేస్తుందని ఈ వర్గాల్లో ఆగ్రహం ఉంది. వీరితో ఎవరు జతకట్టినా ఈ వర్గాలు వ్యతిరేకంగా చూస్తాయి. అందుకే జగన్ గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ పరంగా స్నేహం కొనసాగిస్తున్నారు కానీ.. పార్టీ పరంగా ఎన్నడు బిజెపితో కలిసి నడవలేదు. ముస్లిం మైనారిటీ వర్గాల్లో వైసీపీకి ఎనలేని బలం ఉంది. అయితే తాజాగా పొత్తు చర్యలతో టీడీపీ వద్ద ఉన్న కొద్దిపాటి మైనారిటీల బలం తప్పకుండా చేజారుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ వర్గాల బలమే గెలుపోటములకు కీలకం. అటువంటి చోట్ల మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా మదనపల్లె,పీలేరు, నంద్యాల జిల్లా బనగానపల్లె,నంద్యాల ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ముస్లింల బలం అధికం. బిజెపితో తాజాగా టిడిపి పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అందుకే వైసీపీ శ్రేణులు సైతం బిజెపితో టిడిపి పొత్తు వెనుక పవన్ లేరని.. జగన్ ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ తరహా రాజకీయాలకు కేంద్ర పెద్దలు అవకాశం ఇస్తారా? అన్నది ప్రశ్నగా మిగులుతోంది. వైసీపీ శ్రేణులు చేస్తున్నది ప్రచారమా? వ్యూహమా? అన్నది వారికే తెలియాలి.