Gurukula Recruitment: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్) ఇటీవల చేపట్టిన నియామకాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిలోపే 9 వేలకుపైగా పోస్టులు భర్తీ చేసినట్లు ట్రిప్ ప్రతికలు, టీవీల్లో విస్త్రతంగా ప్రచారం చేసుకుంటోంది. అయితే నియామకాల్లో రోజుకో కేటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులతో మొదలు..
ట్రిబ్ చేపట్టిన ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలు అవకతవకలు జరిగినట్లు నిరుద్యోగులు గుర్తించారు. దీంతో వివాదం మొదలైంది. తాజాగా లైబ్రేరియన్, జేఎల్ బోటనీ పోస్టుల్లోనూ నోటిఫికేషన్‌కు విరుద్ధంగా వ్యవహరించారని తెలుస్తోంది. పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. లోపభూయిష్టంగా చేసిన ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్‌కు విరుద్ధంగా జరిపిన నియామకాలపై ఒక్కొక్కరుగా కోర్టును ఆశ్రయిస్తున్నారు.
తవ్వినకొద్దీ లోపాలు..
ట్రిబ్ ఇటీవల చేపట్టిన నియామకాల్లో తల్వినకొద్దీ అవకతవకలు బయట పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం హడావుడిగా జరిపిన నియామకాలతో అర్హులు నష్టపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఇటు ట్రిబ్ అధికారులు గానీ, అటు ప్రభుత్వంగానీ నోరు మెదపడం లేదు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో అనర్హులకు నియామక పత్రాలు ఇచ్చినట్లు గుర్తించగా, తాజాగా లైబ్రేరియన్ పోస్టులను కూడా అనర్హులకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. జేఎల్ పోస్టులను సైతం నోటిఫికేషన్‌కు విరుద్ధంగా భర్తీ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. 160 బోటనీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికుషన్ ఇచ్చిన ట్రిబ్ బోటనీతోపాటు బయోటెన్నాలజీ, మైక్రో బయాలజీన మెరైన్ బయాలజీ, మాడ్రన్ బయాలజీ, ప్లాంట్ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులని పేర్కొంది. ఆమేరకు జేఎల్ పోస్టులకు 1:2 నిష్పతిలలో మెరిట్ జాబితా విడుదల చేసింది. అయితే ఎమ్మెస్సీతోపాటు డిగ్రీలో బోటనీ ఉండాలని చాలా మందిని పక్కన పెట్టింది. ట్రిబ్ తీరుపై బాధితులు కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను పోస్టుకు ఎంపిక చేయాలని బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే తరహాలో మరో అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా అవే ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఎంపిక తీరుపై అనుమానాలు..
ఇక ట్రిప్ గురుకుల నియామకానికి ప్రకటించిన రిజల్ట్, ఎంపిక తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిమేల్ జెండర్‌పై మేల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. డీఎల్ ఇంగ్లిష్, జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఇద్దరిని ఫీమేల్ జెండర్‌గా చూపిస్తూ ఇద్దరు పురుషులను ఎంపిక చేసింది.
లైబ్రేరియన్ పోస్టుల్లోనూ..
లైబ్రేరియన్ పోస్టులకు కూడా అనర్హులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 434 లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 418 పోస్టులు మాత్రమే తుది జాబితాలో ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం 2014 తర్వాత నాగార్జున అలగప్ప, ద్రవిడతోపాటు ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల్లో లైబ్రేరియన్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు అనర్హులు. అయినా నోటిఫికేషన్‌కు విరుద్ధంగా పలువురిని ఎంపిక చేసినట్లు ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు.
భాషా పండిత పోస్టుల్లోనూ..
ఇక తెలుగు, ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్ పోస్టుల భర్తీ విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన పోస్టులన్నీ భర్తీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులు ఉన్నా పోస్టులు పెండింగ్ పెట్టడంపై ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టులను ఎవరికైనా అమ్ముకుంటారేమో అని అనుమానిస్తున్నారు. భర్తీ ప్రక్రియ ప్రణాళిక లేకుండా చేపట్టడం, వారం రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయడం కారణంగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.