Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25 వరకు కొనసాగనుంది. మరోవైపు ప్రచారాలు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రాకూడదని చంద్రబాబుతో పాటు అనుకూల మీడియా భావిస్తోంది. జిల్లా ట్యాబ్లాయిడ్ నుంచి ప్రధాన సంచిక వరకు జగన్ ప్రభుత్వ వ్యతిరేక కథనాలతో నింపేస్తోంది.ముఖ్యంగా ఈనాడులో అయితే పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి.దీంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తన సాక్షి మీడియాలో ఈనాడు కథనాలకు కౌంటర్ గా ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రత్యేక కాలమ్ ను కొనసాగిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం దారుణంగా వంచన అంటూ ఈనాడులో వచ్చిన కథనానికి.. సాక్షిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్.
డ్వాక్రా వ్యవస్థను తెచ్చింది చంద్రబాబు. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏపీలో డ్వాక్రా విధానాన్ని ప్రారంభించారు చంద్రబాబు. దీంతో మహిళల్లో పట్టు సాధించారు చంద్రబాబు. ఒక విధంగా చెప్పాలంటే 1999 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపునకు మహిళలే కారణం. కానీ అదే మహిళలు 2004లో చంద్రబాబును ఓడించారు. తమ వద్ద పొదుపు సొమ్ము తీసుకుని.. అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం ఏమిటన్న అసంతృప్తి మహిళల్లో వ్యక్తమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి దీనిపైనే దృష్టి పెట్టారు. అందుకే పావలా వడ్డీ పథకాన్ని తెరపైకి తెచ్చారు. డ్వాక్రా సంఘాల సభ్యులు పావలా వడ్డీ చెల్లిస్తే.. మిగతా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత 0 వడ్డీ పథకం ప్రారంభమైంది.
అయితే రాష్ట్ర విభజనతో 2014 ఎన్నికల్లో చంద్రబాబు మహిళలకు కీలక హామీ ఇచ్చారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఆ ఎన్నికల్లో చెప్పుకొచ్చారు. కానీ ఐదేళ్లలో చేయలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరిట పదివేల రూపాయలను మహిళా సభ్యుల ఖాతాల్లో జమ చేశారు. అయితే రుణమాఫీ ఆశించిన డ్వాక్రా సంఘాల సభ్యులుకు.. పదివేల రూపాయల సాయం సంతృప్తినివ్వలేదు.అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబును దారుణంగా ఓడించారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్ 0 వడ్డీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. డ్వాక్రా రుణాలను సక్రమంగా అమలు చేస్తున్నారు. కానీ ఈనాడు విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. అందుకే తన సాక్షి మీడియా ద్వారా జగన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.