IPL 2024: సాధారణంగా ఒక క్రికెట్ మ్యాచ్ లో చేజింగ్ జట్టు కీలక సమయంలో నాలుగు లేదా ఐదు వికెట్లు కోల్పోతే ఎలా ఉంటుంది.. ఇంకేముంది చేతులెత్తేస్తుంది.. అద్భుతం జరిగితేనే విజయం సాధిస్తుంది. కానీ ఈ ఐపీఎల్ 17వ సీజన్లో అలాంటి సంస్కృతికి కొంతమంది యువ ఆటగాళ్లు సరికొత్త భాష్యం చెబుతున్నారు. అలా కానీ కాదు.. ఒత్తిడిలో ఉన్నప్పుడు జట్టును గెలిపించడమే అసలు సిసలైన ఆట అని చాటి చెబుతున్నారు. ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో మెరుపులు మెరిపిస్తున్నారు. సునామీ లాంటి ఆటతీరుతో ప్రత్యర్థి జట్ల బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆటగాళ్లు ఎవరంటే..
అశుతోష్ శర్మ
పంజాబ్ జట్టుకు ఆడుతున్న అశుతోష్ శర్మ గురువారం నాడు ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మైదానంలో అద్భుతంగా సృష్టించాడు. 25 సంవత్సరాల ఈ ఆటగాడు పంజాబ్ జట్టును దాదాపు గెలిపించినంత పనిచేశాడు. కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి ముంబై బౌలింగ్ ను తునాతునకలు చేశాడు. అతడు గనుక ఇంకాస్త ముందుగా మైదానంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా పంజాబ్ గెలిచేది. కేవలం ముంబై మీద మాత్రమే కాదు అంతకుముందు జరిగిన మ్యాచ్ లలోనూ అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ జట్టుపై 17 బంతుల్లో 31, హైదరాబాద్ పై 15 బంతుల్లో 33, రాజస్థాన్ పై 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్ లలో 156 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 205 ఉండడం విశేషం. ఈ సీజన్లో అతడు సిక్సర్ల వీరుడుగా పేరు తెచ్చుకున్నాడు.అశుతోష్ శర్మ ఇప్పటివరకు 18 t20 ఇన్నింగ్స్ లు ఆడగా, 43 సిక్సర్లు బాదాడు. సయ్యద్ మస్తాక్ అలీ టోర్నీలో రైల్వేస్ జట్టు తరఫున 11 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి.. టి20 లో అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ ఘనత 12 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ పేరు మీద ఉండేది.
శశాంక్ సింగ్
గత ఏడాది అంతగా ఆకట్టుకొని ఈ ఛత్తీస్ గడ్ కుర్రాడు.. ఈసారి మాత్రం మెరుపులు మెరిపిస్తున్నాడు. పంజాబ్ జట్టులో అశుతోష్ శర్మ తర్వాత ఆ స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లలో 187 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 179.80 గా ఉంది. ఇటీవల గుజరాత్ జట్టు విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు చేదించడంలో శశాంక్ కీలకపాత్ర పోషించాడు.. కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ మీద మాత్రమే కాదు హైదరాబాద్ జట్టుపై 25 బంతుల్లో 46, ముంబై పై 25 బంతుల్లో 41 పరుగులు చేసి సత్తా చాటాడు. నాలుగు నుంచి ఐదు వికెట్లు కోల్పోయినా పంజాబ్ జట్టు ఏమాత్రం భయపడడం లేదు. దాని కారణం శశాంక్, అశుతోష్ శర్మ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
రియాన్ పరాగ్
ఈ సీజన్ ప్రారంభంలో రియాన్ పరాగ్ పై రాజస్థాన్ జట్టుకు పెద్దగా ఆశలు లేవు. గత ఏడాది తన ఓవర్ యాక్షన్ తో సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ సీజన్ కు వచ్చేసరికి గోడకు కొట్టిన బంతిలాగా దూసుకు వచ్చాడు. 2019లో ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆటగాడు 2023 వరకు 54 మ్యాచులు ఆడి 600 పరుగులు చేశాడు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు తరఫున ఏడు మ్యాచ్లు ఆడిన ఈ ఆటగాడు.. 318 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ లో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ (361) కి గట్టి పోటీ ఇస్తున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతూ స్థిరంగా రన్స్ చేస్తున్నాడు. రాజస్థాన్ జట్టు ఆడిన మ్యాచ్ లలో.. మూడింట జట్టు విజయం సాధించడంలో పరాగ్ ముఖ్య భూమిక పోషించాడు. లక్నోపై 43, ఢిల్లీపై 84*, ముంబై పై 54* పరుగులు చేసి తన సత్తా చాటాడు.
నితీష్ రెడ్డి
హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న ఈ తెలుగు యువకుడు.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. రెండు ఇన్నింగ్స్ లలో 173.33 స్ట్రైక్ రేట్ తో 78 రన్స్ చేశాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 37 బంతుల్లో 64 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇతడు మైదానంలోకి దిగేసరికి హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 64 పరుగులతో ఉంది. ఇకప్పుడు మొదలైంది ఇతడి బ్యాటింగ్.. బౌలర్ ఎవరనేది చూడకుండా ధాటిగా ఆడటంతో హైదరాబాద్ గెలిచింది. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు బంతితో కూడా ఒక వికెట్ పడగొట్టి నితీష్ రెడ్డి హవా కొనసాగించాడు.
అభిషేక్ శర్మ
హైదరాబాద్ ఆటగాళ్లలో ఇతడు ఒక తురుపు ముక్క.. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ హైదరాబాద్ జట్టుకు భారీ స్కోర్ అందిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్ లు ఆడి 211 పరుగులు చేశాడు. 197 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. ముంబై జట్టుపై 63, బెంగళూరు పై 34 పరుగులు చేసి సత్తా చాటాడు.
మయాంక్ యాదవ్
ఇప్పటివరకు మనం బ్యాటర్ల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ బౌలర్ మాత్రం బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ బ్యాటర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్నాడు. ఈ సీజన్లో 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరి.. అత్యంత వేగవంతమైన బంతి విసిరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు కోల్ కతా జట్టు తరుపున మూడు మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఇతడు జట్టుకు దూరమయ్యాడు.
వైభవ్ అరోరా
కోల్ కతా జట్టు లో అత్యంత కీలకమైన బౌలర్. నిలకడగా రాణిస్తూ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లలో 7 వికెట్లు పడగొట్టాడు. బంతిపై నియంత్రణ సాధించడంలో ఇత్తడి తర్వాతే ఎవరైనా. రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల నేర్పరితనం ఇతడి సొంతం.