https://oktelugu.com/

YS Jagan- KCR : అటు జగన్.. ఇటు కేసిఆర్.. మధ్యలో చంద్రబాబు, రేవంత్.. కాంగ్రెస్, బిజెపి దోబూచులాట!

రాజకీయాల్లో పరమపద సోపానాలు ఉంటాయి. ఎవరికి నిచ్చెన పగులుతుందో.. ఎవరు పాము నోట్లో పడతారో? తెలియదు కూడా. తెలుగు రాష్ట్రాల్లో జగన్, కెసిఆర్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. గట్టెక్కేందుకు ఈ ఇద్దరు మిత్రులు వేరువేరు దారులు ఎంచుకోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : July 27, 2024 / 11:42 AM IST
    Follow us on

    YS jagan- KCR : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా.. ఓటమిపాలైన పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న వ్యూహాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గతమెంతో ఘనం అన్నట్టు ఉంది తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి. ఇంచుమించు కెసిఆర్, జగన్ పరిస్థితి ఒకే మాదిరిగా ఉంది. ఇద్దరికీ ఘోర పరాజయం ఎదురైంది. పార్టీల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కేసులు చుట్టుముడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు మిత్రులు వేరువేరు దారులు ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన అస్తిత్వం కోసం జగన్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడంతో పాటు తీహార్ జైల్లో ఉన్న కుమార్తెను విడిపించుకునేందుకు బిజెపితో సయోధ్య కుదుర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరు మిత్రుల కథ ఇలా ఉంటే.. వీరితో జాతీయ పార్టీలు ఆడుతున్న ఆట మరోలా ఉంది. ఈ ఇద్దరికీ ఇప్పుడు జాతీయ పార్టీల అవసరం కీలకం. అనివార్యం కూడా. అందుకే తమ పార్టీలను పణంగా పెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఇద్దరికీ ఎదురైంది. అందుకే ఇప్పుడు వారిద్దరూ జాతీయ రక్షణ కవచాలను ఎంచుకునే పనిలో పడ్డారు. ప్రమాదం నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. అందుకు ఎంత త్యాగానికైనా సిద్ధపడుతున్నారు. కానీ వీరు త్యాగాన్ని స్వీకరించే పరిస్థితిలో జాతీయ పార్టీలు ఉన్నాయా? అంటే మాత్రం ప్రస్తుతానికి మౌనమే సమాధానం అవుతోంది.

    * ఎవరి దారి వారిదే
    కెసిఆర్ బిజెపి వైపు చూస్తున్నారు.జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఢిల్లీ ధర్నాలో స్పష్టమైంది. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి రాజకీయ పక్షాలు వచ్చి జగన్ కు మద్దతు తెలిపాయి. వైయస్ షర్మిల బేడదను వదిలించుకుని రాష్ట్రంలో వైసీపీని కాపాడుకునేందుకు జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అందుకే వైయస్ కుమార్తె షర్మిలకు పగ్గాలు అప్పగించింది. కానీ ఆమె నేతృత్వంలో పార్టీ పుంజుకోలేకపోతోంది. అందుకే వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడితే కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించక తప్పని పరిస్థితి. అదే జరిగితే జగన్, కెసిఆర్ దారులు వేరు కాక తప్పదు.

    * కెసిఆర్ ను బిజెపి నమ్ముతుందా?
    అయితే కెసిఆర్ చర్యలను తెలిసిన బిజెపి దగ్గరకు రానిస్తుందా? లేదా? అన్నది తెలియాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో టిఆర్ఎస్ను విలీనం చేస్తానని కెసిఆర్ ఆఫర్ చేశారు. ఆయన మాటలను నమ్మిన సోనియా రాష్ట్ర విభజనకు సిద్ధపడ్డారు. తీరా తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక అడ్డం తిరిగారు కేసీఆర్. ఇప్పుడు కూడా సాయం అందుకున్న తరువాత మాట తప్పరని ఎలా అనుకోవాలి. పైగా ప్రధాని నరేంద్ర మోడీని అవమానించి, అవహేళన చేసి, గద్య దించాలనుకున్న కేసీఆర్ కి బిజెపి పార్టీ అందిస్తుందా? ఒకవేళ కెసిఆర్ తో బిజెపి రహస్య అవగాహన చేసుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధపడితే, ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చూస్తూ ఊరుకుంటారా? ప్రస్తుతానికైతే దీనికి సమాధానం దొరకదు.

    * జగన్ కు వారే అడ్డంకి
    ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిలను పంపించిందే రేవంత్ రెడ్డి. ఇప్పుడు జగన్ ప్రవేశించి షర్మిలను బయటకు తోసేస్తే రేవంత్ ఊరుకుంటారా? అన్నది ఒక చిక్కుముడి. కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ ద్వారా టచ్ లోకి చంద్రబాబు వెళ్లారని జగన్ ఆరోపిస్తున్నారు. అంటే జగన్ కాంగ్రెస్ టచ్ లోకి వస్తే కచ్చితంగా అడ్డంకిగా నిలిచేది రేవంత్ రెడ్డి.అందుకే జగన్ రాకను కచ్చితంగా రేవంత్ అడ్డుకుంటారు.ఇన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అందరూ సేఫ్ జోన్ లో ఉన్నా.. కష్టాల్లో మాత్రం మిత్రులు కెసిఆర్, జగన్ ఉన్నారు. వారి ప్రయాణం భవిష్యత్ నిర్దేశిస్తుంది. అంతవరకు వారు వెయిట్ చేయక తప్పదు.