Anna canteens  : అన్న క్యాంటీన్ల విషయంలో చేస్తోన్న పెద్ద తప్పు అదే.. అక్కడ ఏర్పాటు చేస్తేనే చాలా బెటర్

నగరాల్లో భోజన ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో అన్న క్యాంటీన్ల ఏర్పాటు పై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Written By: Dharma, Updated On : August 16, 2024 10:26 am

Anna canteens At Hospitals

Follow us on

Anna canteens : రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. పేదలకు పట్టెడన్నం కోసం ప్రభుత్వం ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈరోజు నుండి ఈ క్యాంటీన్లు పూర్తిస్థాయి అందుబాటులోకి రానున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నారు ఈ క్యాంటీన్లలో. ఐదు రూపాయలకే టిఫిన్, భోజనాలను సమకూర్చుతారు. రోజుకు 15 రూపాయలు ఉంటే సగటు మనిషి ఆహార అవసరాలు ఇట్టే తీరిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే నిరుపేదలకు, ఏ ఆసరా లేనివారికి అన్న క్యాంటీన్లు కొండంత అండ. రాష్ట్రవ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్ లను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఆహారం అందించే బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. శుచి, శుభ్రతకు పెద్దపీట వేస్తూ ఇక్కడ ఆహారాన్ని అందించనున్నారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12 నుంచి మూడు వరకు భోజనం, రాత్రి 7 నుంచి 9:30 గంటల వరకు భోజనం అందించనున్నారు. ఆహారాన్ని నిర్దిష్టమైన కొలతలో కూడా అందించనున్నారు. ఎప్పటికప్పుడు మెనూ మారుతుంటుంది. మెనూ ప్రకారం భోజనం అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్షయపాత్ర సంస్థ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది.

*:వారికి ఎంతో ప్రయోజనం
ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. క్రమేపీ విస్తరించనున్నారు. నగరాల్లో చిరు వ్యాపారులు, రోజువారి కూలీలు, నిరుద్యోగులు అధికంగా ఉంటారు. క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వారికి ప్రయోజనంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే నగరాల్లో ఎక్కువ క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పట్టణాల్లో సైతం వివిధ అవసరాలకు వచ్చే ప్రజల కోసం ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

* రోగి బంధువులకు ఉపయోగం
అయితే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లను ఆస్పత్రుల దగ్గర్లో ఏర్పాటు చేస్తే..రోగి బంధువులకు, సహాయంగా వచ్చేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సాధారణంగా నగరాలు పట్టణాల్లో ఒకరి భోజనం 70 నుంచి 100 రూపాయలు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్పత్రులకు వైద్య సేవలకు వచ్చిన పేదలకు ఇబ్బందికరంగా మారుతోంది. భోజన ఖర్చులే అధికంగా ఉంటున్నాయి. అందుకే ఆసుపత్రుల వద్ద అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని.. ఆ దిశగా ఆలోచన చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

* భారీ విరాళాలు
మరోవైపు అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు పిలుపుమేరకు చాలామంది స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. మున్ముందు ఈ విరాళాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే కొత్తగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనుకుంటే.. ఆస్పత్రుల వద్ద అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే రోగి బంధువులతో పాటు సంరక్షకులకు సైతం కొంత ఖర్చుల విషయంలో ఉపశమనం దక్కే అవకాశం ఉంది.