TTD Chairmen Post: టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనుందా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమించనుందా? ఈ మేరకు నిర్ణయం జరిగిపోయిందా? మూడు పార్టీలు సమ్మతించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతోంది. కానీ ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం చేపట్టలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత జనసేనకు చెందిన మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. కానీ ఆయన రాజ్యసభ పై ఆశలు పెట్టుకోవడంతో అదంతా ప్రచారం అని తేలిపోయింది. మరోవైపు అశోక్ గజపతి రాజు పేరు వినిపించింది. ఆయన సైతం గవర్నర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో సినీ నటుడు మురళీమోహన్, టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేర్లు ప్రధానంగా వినిపించాయి. కానీ ఎవరిని నియమించలేదు.
* క్యాబినెట్ హోదా తో సమానం
టిటిడి చైర్మన్ పోస్ట్ అంటే క్యాబినెట్ హోదా తో సమానం. ఎన్నో రకాల ప్రోటోకాల్, గౌరవ మర్యాదలు ఆ పోస్టుకు ఉంటాయి. అందుకే ఆ పదవిని దక్కించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రభుత్వాల అధినేతల సైతం తమ అస్మదీయులను ఆ పదవిలో కూర్చోబెట్టాలని చూస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వై వి సుబ్బారెడ్డి కి ఆ పదవి దక్కింది. కానీ చివరి ఏడాది రాజకీయ కారణాల దృష్ట్యా భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వంద రోజులు దాటుతున్నా టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపిక మాత్రం జరగలేదు.
* మూడు పార్టీల మధ్య పోటీ
రాష్ట్రంలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. టిటిడి చైర్మన్ పోస్ట్ ను మూడు పార్టీలు ఆశిస్తున్నాయి. కానీ ఆ పదవి టిడిపికి దక్కే అవకాశం ఉంది. కానీ ఆశావహుల జాబితా మాత్రం అధికంగా ఉంది. దేవుడు సేవ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. అందులో మీడియా, చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని రకాల నామినేటెడ్ పోస్టుల ప్రకటన వచ్చినా.. టీటీడీ ట్రస్ట్ బోర్డు విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు.
* మాజీ న్యాయ కోవిధుడికి ఛాన్స్
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి. పూర్వాశ్రమంలో టిడిపి లీగల్ సెల్ కు సేవలందించారు. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో.. వైసీపీ అధికారంలో ఉంది. జగన్ సీఎం గా ఉన్నారు. అప్పట్లో ఆయన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎన్వి రమణ తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీటీడీ వివాదాలు జరుగుతున్న దృష్ట్యా.. ఒక న్యాయ నిపుణుడికి చైర్మన్ గా అవకాసం ఇస్తే మంచి సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: It is reported that the name of nv ramana who served as the chief justice of the supreme court has been finalized as the chairman of the ttd trust board
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com