AP Deputy CM Pavan Kalyan : పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక చేగువేరా. తనలోని ఒక చేగువేరా ఒక కమ్యూనిస్టు,ఒక బహుజన సానుభూతిపరుడు ఉన్నాడని జన సైనికులు భావించేవారు.పవన్ చర్యలు కూడా అలానే ఉండేది.ఆయన నటించిన సినిమాల్లో సైతం కమ్యూనిస్టు భావజాలాన్ని చూపించేవారు.తాను సినిమాల్లోకి రాక పోయి ఉంటే అడవుల్లో అన్న అయి ఉండేవాడినని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్. అంతలా పెనవేసుకుపోయింది కమ్యూనిజంతో ఆయన బంధం.అయితే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు అంటూ పవన్ కళ్యాణ్ కొత్త పంధాను ఎంచుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు కమ్యూనిస్టుగా ఉన్న పవన్ ఆధ్యాత్మిక వేత్తగా ఎందుకు మారారు? సమాజ అవసరం కోసం మారారా? లేకుంటే రాజకీయ ప్రయోజనాల కోసం మారారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే బిజెపితో జతకట్టి మత రాజకీయాలు చేస్తున్నారని పవన్ పై ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది అనవసర రిస్క్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఆ రెండు ఆదర్శాలు అంటూ
అయితే జనసేన ప్రజలకు అండగా నిలబడుతుందని.. ప్రజాహితమే తమ అభిమతమని తరచూ చెప్పుకునేవారు. విప్లవ కవి దాశరధి కృష్ణమాచార్యులు స్ఫూర్తితో పార్టీ సనాతన ధర్మం, సోషలిజం రెండింటితో ముందుకు సాగుతోందని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్. జనసేన ఆవిర్భావం నుంచి ఒక ప్లాన్ తో ముందుకు వెళ్లారు పవన్. ప్రజారాజ్యం నేర్పిన గుణపాఠాలతో జనసేన ఆవిర్భావం నుంచి జాగ్రత్త పడ్డారు. ఎక్కడా తప్పటడుగులు వేయలేదు. పరిస్థితులకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే నాడు కమ్యూనిస్టులతో ముందుకు సాగారు. ఇప్పుడు వారి విరోధులు బిజెపితో కలిసి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పటి పరిస్థితులకు తగ్గట్టు అప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తోంది.
* రాష్ట్రం కోసం నిర్ణయాలు
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో పవన్ చాలా యాక్టివ్ గా పని చేశారు. కానీ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అటు తరువాత పరిణామాలతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకాల మరణం చెందారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు జగన్. అప్పటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ కు సమర్థవంతమైన నాయకత్వం అవసరం ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు పవన్ మదిలో బలంగా కనిపించారు. అందుకే రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. రెండు చోట్ల అనుకున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి.
* వామపక్షాలతో పొత్తు
2019 ఎన్నికల్లో జగన్ ఆడిన గేమ్ లో పావులుగా మారారు చంద్రబాబు, పవన్. జగన్ వ్యూహానికి చంద్రబాబు బిజెపికి దూరం కావాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్ సైతం పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో చేరేందుకు వీలులేని పరిస్థితి. అటువంటి క్లిష్ట సమయంలో కమ్యూనిస్టులతో ముందుకు సాగారు. ఎర్ర కండువాను మెడలో వేసుకోవాల్సి వచ్చింది. అయితే తనకు కమ్యూనిస్టు భావజాలం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు పవన్. ఒకానొక దశలో సినిమాల కంటే అడవిలో సాయుధ పోరాటం చేసే వారే మేలన్న అభిప్రాయానికి వచ్చారు కూడా పవన్. అయితే ఆ ఎన్నికల్లో వామపక్షాలతో జతకట్టినా ప్రజలు ఆహ్వానించలేదు. కనీసం పవన్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో సైతం గెలిపించలేదు.
* బిజెపితో స్నేహం
అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితిని ముందుగానే అంచనా వేశారు పవన్. జగన్ దుందుడుకు చర్యలను గమనించారు. అందుకే కేంద్రంలో ఉన్న బిజెపితో స్నేహం కుదుర్చుకున్నారు. అయితే ఎన్నడూ ఆ స్నేహాన్ని దుర్వినియోగపరచుకోలేదు. పవన్ కు కమ్యూనిస్టు భావజాలం ఎంత ఇష్టమో.. జాతీయ వాదం అన్న అంతే ఇష్టం. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సాహస నిర్ణయాలు తీసుకున్నారు. దేశ సమైక్యతకు, సమర్థతకు పెద్దపీట వేశారు. ఈ నిర్ణయాలను ఆహ్వానించారు పవన్. అదే సమయంలో ఆధ్యాత్మికభావజాలం కూడా పవన్ లో ఎక్కువే.ఎవరికి వారు తమ మతాన్ని అభిమానిస్తూనే.. ఎదుటి మతాన్ని గౌరవించాలన్నది పవన్ ఆలోచన. తాజాగా టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం మాట్లాడారు. అంతేతప్ప అవసరానికి, రాజకీయాల కోసం పవన్ ఎప్పుడూ మారలేదని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థుల ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Why did pawan a communist ideologue become a spiritualist
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com