Jai Bharat National Party: ఏపీలో మరో కొత్త పార్టీకి చోటు ఉందా? అంతలా రాజకీయ శూన్యత కనిపిస్తోందా? సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ చెబుతున్న మార్పు సాధ్యమేనా? తమది పట్టని పార్టీ అని.. పుట్టిన పార్టీగా చెబుతున్న ఆయన మాటలను ప్రజలు విశ్వసిస్తారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. దాదాపు సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ఆలోచనలకు దగ్గరగా ఇవి ఉన్నాయి. గతంలో లోక్ సత్తా ఉద్యమ సంస్థను రాజకీయ పార్టీగా మార్చి జెపి ఇదే తరహా ఆలోచనలు బయటపెట్టారు. కానీ వర్క్ అవుట్ కాకపోవడంతో సైలెంట్ అయ్యారు.ఇప్పుడు అవే మాటలు జేడీ లక్ష్మీనారాయణ చెబుతుండడం విశేషం.
గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. రెండున్నర లక్షల ఓట్లు సాధించారు. జనసేన నుంచి బయటకు వచ్చినా విశాఖ పార్లమెంటు స్థానం పై మాత్రం మమకారం పోలేదు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇటీవల మాత్రం సొంత పార్టీని పెట్టుకుంటానని లీకులు ఇచ్చారు. ఏకంగా పార్టీని స్థాపించి దానిని నిజం చేశారు. అయితే పార్టీ స్థాపించే సమయంలో ఆయన చేసిన ప్రకటనలు సాధ్యమా? అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఆయన చెబుతున్న మాటల ప్రకారం పార్టీని నడిపించగలరా? అభ్యర్థులు దొరుకుతారా? అంటే మాత్రం అవునన్నా సమాధానం రావడం లేదు. సాధ్యం కాదన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది.
అవినీతి రహితం, పక్షపాత రహిత పాలన అందిస్తానని జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. అటువంటి వారినే అభ్యర్థులుగా బరిలో దించుతానని చెప్పుకొచ్చారు. అయితే ఈ తరహా ఆలోచనలు, ఆశయాలు ఉన్న అభ్యర్థులు రంధ్రాన్వేషణ చేసినా దొరకరు. ప్రధాన రాజకీయ పార్టీలకే అభ్యర్థులు దొరకని పరిస్థితి. రాజకీయాల్లో పెరుగుతున్న వ్యయము, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 175 మంది అభ్యర్థులను ప్రకటించాలంటే కత్తి మీద సామే. ఒక విధంగా చెప్పాలంటే పది నుంచి 20 మంది అభ్యర్థులను పోటీలో పెట్టుకోవాలన్నా గగనమే.ప్రజలు, ఓటర్లు కులాలుగా విభజించబడ్డారు. వారి అవసరాలను గుర్తించి రాజకీయం చేయాల్సి ఉంటుంది. సిద్ధాంతం, ఆశయాలు అన్నవి పక్కన పెడితేనే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే మరో లోక్ సత్తా పార్టీగానే లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ మిగిలే అవకాశం ఉంది.
వివి లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పులేదు కానీ.. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీని ప్రకటించడం మాత్రం సాహసమే. పార్టీ ప్రజల్లోకి వెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలపై విస్తృత చర్చ నడవాలి. ఆ పార్టీని ప్రజలు గుర్తించాలి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో స్పేస్ కనిపించడం లేదు. ప్రజలు వేరే పార్టీకి ఆప్షన్ ఇచ్చుకునే స్థితిలో లేరు. అయితే లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటన వెనుక ఆశయాలు గొప్పవే అయినా.. ఆ స్థాయిలో అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకరి గెలుపోటములు నిర్దేశించడానికి పార్టీ పెట్టారన్న విమర్శ కూడా ఉంది. ఇది నిజమేనని తేలితే మాత్రం జేడీ లక్ష్మీనారాయణ పార్టీని ప్రజలు పక్కన పెట్టే అవకాశం ఉంది. కానీ సుదీర్ఘ ప్రయాణం, తన ఆదర్శం నిజమేనని తేలితే మాత్రం ప్రజలు అక్కున చేర్చుకునే ఛాన్స్ ఉంది. మరి జై భారత్ నేషనల్ పార్టీని వివి లక్ష్మీనారాయణ మున్ముందు ఎలా తీసుకువెళ్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో సరైన ఫలితాలు వచ్చినా.. రాకున్నా పార్టీని మాత్రం కొనసాగిస్తే ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.