Visakha Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant) చుట్టూ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రైవేటీకరణ అంశం గత కొన్నేళ్లుగా కుదిపేస్తోంది. అయితే ఈ ప్లాంట్ విషయంలో మాత్రం కేంద్రం అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జరగదని అంతా భావించారు. కూటమి నేతలు సైతం స్టీల్ ప్లాంట్ విషయంలో అనేక రకాలుగా భరోసా కల్పిస్తూ.. నమ్మకమైన ప్రకటనలు చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ పరిణామం జరిగింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పలు విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లు జారీచేసింది. దీంతో కార్మికులతో పాటు ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ప్రైవేటీకరణ లో భాగంగానే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు మొదలయ్యాయి. కార్మికులు,ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో ఒక్కో విభాగాన్ని ప్రైవేటుపరం చేయడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాధించి తీరుతుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
గత కొన్నేళ్లుగా..
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అనేది ఇప్పటిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివరణ కూడా ఇచ్చింది. ఒకవైపు ప్రైవేటీకరణకు సంబంధించి ప్రకటనలు వచ్చాయి. మరోవైపు కేంద్ర మంత్రులు( central ministers ) నేరుగా వచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ప్లాంట్ ఉత్పత్తులకు సంబంధించి ఆర్థిక ప్యాకేజీ పదకొండు వేల కోట్ల రూపాయలను అందించింది కేంద్రం. దీంతో ప్రైవేటీకరణ అనేది నిలిచిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో ఆజాగా వెలువడిన ఒక నోటిఫికేషన్ సరికొత్త సమస్యను తెరమీదకు తెచ్చింది. అంచలంచెలుగా.. దశలవారీగా ప్లాంట్ ను ప్రైవేటు పరం దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కర్మాగారాన్ని రక్షిస్తామని యాజమాన్యం ఒక వైపు ప్రకటనలు చేస్తూనే ఉన్నా.. మరోవైపు దశలవారీగా విభాగాలను ప్రైవేటీకరించేందుకు సిద్ధపడుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
34 విభాగాలు క్లోజ్..
స్టీల్ ప్లాంట్ లో చాలా రకాల విభాగాలు ఉంటాయి. అందులో ప్రస్తుతం 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ఉక్కు యాజమాన్యం నోటిఫికేషన్( notification) జారీ చేసింది. దీనిపై ఉద్యోగులతో పాటు కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. యాళ్ల తరబడి నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఒక పద్ధతి ప్రకారం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కొన్ని విభాగాలను ప్రైవేటీకరించేందుకు వరుసగా నోటిఫికేషన్లు జారీచేసింది యాజమాన్యం. తాజాగా ఒకేసారి 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు ప్రకటన విడుదల చేసింది. దీంతో కార్మికులతో పాటు ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. ఇప్పుడు ఒక్కో విభాగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
Also Read: ఏపీలో ఆ మహిళలకు ఉచితంగా రూ.11 వేలు
ఇరకాటంలో కూటమి నేతలు..
వాస్తవానికి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదని కూటమి నేతలు( alliance leaders) హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఆపై పవన్ కళ్యాణ్ సైతం గుర్తింపు కలిగిన నాయకుడిగా ఉన్నారు. ఆయన సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే ఊరుకోమని హెచ్చరించారు కూడా. ప్లాంటు భవితవ్యం పై చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. మరింత కష్టపడి ప్లాంట్ ఉత్పత్తిని కూడా పెంచాలని సూచించారు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు ఉద్యోగులతో పాటు కార్మికులు. ఇలా చేస్తున్న క్రమంలో ఒక్కో విభాగాన్ని ప్రైవేట్ పరం చేయడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే కూటమి నేతలపై సైతం ఒత్తిడి పెరగడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.